మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో నాకు విభేదాలు లేవు : మంత్రి పొన్నం ప్రభాకర్

తనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోదరుడిలాంటివారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదేనని తెలియజేశారు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగుతుందని, ఎవరు విడదీయరానిదని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. తాను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బిసి వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు.

అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని మండిపడ్డారు. దీంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తాను తీవ్రంగా విచారిస్తునని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై తాము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.