న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో ఆకట్టుకున్న ప‌ర్యాట‌క శాఖ స్టాల్

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన టూరిజం స్టాల్ సందర్శకులను కట్టిపడేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంయుక్తంగా ఈ స్టాల్‌ను ఆవిష్కరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయం, పులుల అభ‌యార‌ణ్యాలు, సోమ‌శిల‌, ల‌క్న‌వ‌రం, నాగ‌ర్జున సాగ‌ర్ బుద్ధ‌వ‌నం, భువ‌న‌గిరి కోట‌, పాండ‌వుల గుట్ట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను న‌రెడ్కో ప్రాప‌ర్టీ షో వేదికగా ప్రదర్శించారు.

తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక సంపద, సహజ సౌందర్యాన్ని సమన్వయంగా ప్రదర్శించిన ఈ స్టాల్ ప్రాప‌ర్టీ షోలో ఆకర్షణీయ కేంద్రబిందుగా నిలిచింది. భట్టి విక్రమార్క, కృష్ణారావు స్టాల్‌లోని ఛాయ‌చిత్రాల‌ను తిల‌కించారు. ప‌ర్యాట‌కాన్ని ఆర్థిక వృద్ధి యొక్క కీలక శక్తిగా మార్చాలనే ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబించింది.. ఈ స్టాల్ సందర్శకుల దృష్టిని ఆకర్షించి, తెలంగాణ టూరిజం ఔన్నత్యాన్ని చాటిచెప్పింది.