ఏసీబీ వలలో ఇద్దరు మత్స్యశాఖ అధికారులు

మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారిణి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ చిక్కుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం… మాదన్నపేట మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ 2023లో 124 మందికి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సభ్యత్వం ఖరారు కాకపోవడంతో అధికారులను ప్రశ్నించగా సభ్యత్వం నమోదు కావాలంటే హైదరాబాద్‌లోని పలు కార్యాలయాలతో ముడిపడి ఉందని మత్స్యశాఖ అధికారిణి నాగమణి తెలిపారు. కానీ నూతన సభ్యత్వాలు జిల్లాల పరిధిలోనే కేటాయించుకోవాలని 2025 ఆగస్టులో ప్రభుత్వం నుండి సర్కులర్ రావడంతో విషయం తెలుసుకున్న మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ నర్సయ్య అధికారులను అడిగారు. నూతన సభ్యత్వాల కోసం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ రూ.80 వేలు డిమాండ్ చేయగా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ నాగమణికి ఫిర్యాదు చేశాడు. కానీ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిన డబ్బులను ఇస్తేనే నూతన సభ్యత్వాలు ఇస్తానని అధికారిణి నాగమణి చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ రూ.75 వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి కోరిక మేరకే తాను మత్స్యకారుల సంఘం నుంచి లంచం తీసుకున్నట్లు హరీష్ ఒప్పుకున్నాడని, దీంతో వీరిద్దరినీ శనివారం కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు ఏసీబీ డిఎస్‌పి సాంబయ్య తెలిపారు.