ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రాష్ట్ర ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నది. కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో జిన్నర్లు ముందుకు రాని సమయంలో కూడా పలు దఫాలు చర్చలు జరిపి కొనుగోళ్లలో ప్రతిస్టంబన తొలగించి, ప్రక్రియ వేగవంతము చేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. పత్తి రైతులకు మద్ధతు ధర దక్కే విషయములో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకొన్న చర్యలు, అనగా సీసీఐతో చర్చలు, కపాస్ కిసాన్ అప్లికేషన్ పై అవగాహన కార్యక్రమము, జిల్లాల వారీ అధికారుల నియమాకం, రైతునేస్తం ద్వారా నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, జిల్లా కలెక్టర్ల ద్వారా సేకరణ కేంద్రాలను నోటిఫై చేయించడం ఇలా ప్రతి ఒక్కటి రాష్ట్ర మంత్రి తమ్మల ప్రత్యక్షంగా పర్యవేక్షించడం తెలిసిందే. ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని అక్టోబరు 22 నుంచి కొనుగోళ్లకు వెళ్తున్న సమయంలో రాష్ట్రం నుండి సహకారం అందించాలని కొంతమంది బిజెపి పెద్దలు మాట్లాడటం విడ్డూరం. పత్తి కొనుగోళ్లలో ప్రతిస్టంబన ఏర్పడినప్పుడు కానీ, పత్తి దిగుమతిపై అమెరికా ఒత్తిడితో ఆంక్షలు ఎత్తివేసి మన రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టినప్పుడు కానీ కనపడని, వినపడని నాయకులు ఈ రోజు రాష్ట్ర సహకారం, పత్తి సేకరణ అనీ మన ముందుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు మద్ధతు ధరలు ప్రకటించడముతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందా? ఆ మద్దతు ధర రైతులకు దక్కేటందుకు ఏమన్నా చర్యలు తీసుకొంటు న్నార? ఆ ధరలకు ఏమన్నా చట్టబద్ధత ఉందా?

కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతుల సుంకం మినహాయింపులను డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. అనేక కష్ట నష్టాలకోర్చి, కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకొని సరిగా రైతులకు పంట చేతికొచ్చే దిశలో తీసుకొనే ఇటువంటి నిర్ణయాల వలన రైతుల ఆర్థిక పరిస్థితులు తలక్రిందులయ్యే ప్రమాదముంది. సుంకాల మినహాయింపుతో బహిరంగ మార్కెట్లో ఇప్పటికే పత్తి ధరలు గణనీయంగా పడిపోయాయి. అధిక వర్షాల వలన, వివిధ తెగుళ్ల వలన రంగు మారిన పత్తిని కఠిన నియమాల కారణంగా సీసీఐ ఆ పత్తిని సేకరించనప్పుడు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఒకవేళ నిజంగా దేశంలో వస్త్ర పరిశ్రమను పరిరక్షించే విధంగా మీరు చెప్పుకొంటున్న ఈ నిర్ణయం తీసుకునే ముందు, రాష్ట్రాల వారీ ముఖ్యంగా తెలంగాణ వంటి అధికంగా పంట పండించే రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా ఇలా తీసుకొనే ఏకపక్ష నిర్ణయాలు మన రైతుల ఆర్థిక వృద్దికి తీవ్ర విఘాతం కల్గిస్తాయి. ఇటువంటి చర్యలు అత్యవసరమైనప్పుడు ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి దేశీయ పంట ప్రారంభమైన తర్వాత లేదా గరిష్ట మార్కెటింగ్ సీజన్ లలో, దిగుమతులపై సుంకాలను పెంచే విషయాన్ని కూడా పరిగణించే విధంగా రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తే బాగుంటుంది. రాష్ట్రం నుండి గత సీజన్ లో మరియు ఈ సీజన్ లో మొక్కజొన్న, జొన్న పంటలను మద్ధతు ధరకు సేకరించడానికి రాష్ట్రానికి చేయుతనివ్వాల్సిందిగా విజ్ఙప్తి చేసాం. అదేవిధంగా మిగతా పంటలపై 25% పరిమితులు ఎత్తివేసే విధంగా పలుమార్లు కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నాం.

ఇప్పటికీ ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టత లేదు. ఐనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పత్తి రైతే కాదు, ఏ ఒక్క రైతు కూడా నష్ట పోకూడదని రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక భారం మోస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక పత్తి, వరే కాక, అన్ని ఇతర పంటలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు కొనుగోలు చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, కావున రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్రం ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుందని, ఒకవేళ నిజంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడాలని అనుకొంటే మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్రం కొనడానికి ఒప్పించడంతో పాటు, ఇతర పంటలపై కేంద్ర విధిస్తున్న 25% పరిమితి ఎత్తివేసే విధంగా ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నాను. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోళ్లు జరుపడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకొని , పత్తి కొనుగోళ్ళకు సిద్ధమవుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం వంటివి మాట్లాడటం ఏ మాత్రం హర్షనీయం కాదు అన్నారు. రైతులు తమ మొబైల్ నంబర్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ AEO Logger యాప్ లో ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ పరిధి AEOని సంప్రదించి మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా పంట అమ్మకాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు జరుపుకోవచ్చని మంత్రి తెలిపారు.

వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి మేరకు, CCI (Cotton Corporation of India) తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుమతి ఇచ్చిందని, రైతులు తమ పత్తిని పాత జిల్లాల పరిధిలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అన్నారు. రైతులు తమ సందేహాలు లేదా ఫిర్యాదులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-5779 ద్వారా తెలియజేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ ఉదయం 7:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని మంత్రిగారు అన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ & సహకార శాఖ ఆధ్వర్యంలో ఉన్న డైరెక్టర్ మరియు ఎండీ స్థాయ అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగింది. ఈ బృందాలు జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు తో సమన్వయంతో రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షణ చేస్తాయి అని మంత్రి అన్నారు.