పేరుకు దిగ్గజ కంపెనీ.. చేసేవన్నీ చట్టవిరుద్ధ పనులు..

  • హెటిరో ఫార్మా కాలుష్యజలాల విడుదల.. కెమికల్ డ్రమ్ముల అక్రమ నిల్వ
  • నల్లకుంట చెరువు కలుషితానికి హెటిరో ఫార్మా కారణమని ఆరోపణలు
  • కెమికల్ డ్రమ్ముల అక్రమ నిల్వ ఫంక్షన్ హాల్ పై దాడి చేసిన నార్కోటిక్ అధికారులు
  • కన్నెత్తి చూడని పీసీబీ ఉన్నతాధికారులు
  • కాలుష్య జలాలకు మూగజీవాలు మృత్యువాత
  • ప్రజా సంఘాల మద్దతుతో భారీ పోరాటానికి కార్యాచరణ సిద్దం
  • ఊరిని రక్షించుకునేందుకు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆవిర్భావం
  • ఇంతటి కాలుష్యానికి పీసీబీ ఉన్నతాధికారుల అవినీతే కారణం అంటున్న స్థానికులు..
  • పీసీబీ ఉన్నతాధికారుల అవినీతిపై త్వరలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పర్యావరణ వేత్తల నిర్ణయం

పేరుకు దిగ్గజ కంపెనీ.. పేరు ప్రతిష్ఠలకు డోకాలేదు.. కానీ చేసే పనులన్నీ చట్టవిరుద్ధమైనవే.. ఆ కంపెనీ ఏదో కాదు.. హెటిరో ఫార్మా పరిశ్రమ.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గడ్డపోతారంలోని ఈ కంపెనీ.. వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హెటిరో ఫార్మా పరిశ్రమ నుంచి వ్యర్థాలను దోమడుగు నల్లకుంట చెరువులోకి విడుదల చేయడంతో నీరు కలుషితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పిసిబి అధికారులు శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపించి మమ అనిపించారు. భూగర్భజలాలు సైతం కలుషితం కావడంతో స్థానికులు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. చర్మ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నరకం అనుభవిస్తున్నా పీసీబీ ఉన్నతాధికారులు మాత్రం హెటిరో ఫార్మా జోలికి వెళ్లడం లేదు.. దీనికి కారణం హెటిరో ఫార్మా పరిశ్రమ యజమాన్యం నుండి పీసీబీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున లంచాలు అందయానే స్థానిక ప్రజల నోటి నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ కంపెనీ ఆడిటింగ్ నుంచి తప్పించుకునేందుకు కెమికల్ డ్రమ్ములను అక్రమంగా నిల్వ చేసిన వాటిపై నార్కోటిక్ అధికారులు దాడి కూడా చేశారు.

ఫంక్షన్ హాలులో కెమికల్ డ్రమ్ములను ఆక్రమంగా నిల్వ చేస్తున్నా. హెటిరో ఫార్మా తమకున్న రాజకీయ పలుకుబడితో అధికార యంత్రాంగాన్ని భయబ్రాంతులకు గురిచేస్తూ.. భారీగా లంచాలు ఇస్తూ నిజాలు బయటకు రాకుండా చూస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యర్థ జలాలు, కెమికల్ వ్యర్థాలను శుద్ధి చేయడానికి కర్మాగారానికి తరలించాల్సి ఉండగా ప్రమాదకరమైన కెమికల్స్ ను అక్రమంగా నిల్వ ఉంచి రాత్రివేళ కాల్వలు, పొలాల్లోకి డంప్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకున్న పరిమితికి మించి ప్రొడక్షన్ చేయడం ఒక కారణమైతే, శుద్ధి కర్మాగారానికి తరలిస్తే ఖర్చు ఎక్కువ రావడంతోపాటు తమ బండారం బయటపడుతుందని ఆక్రమంగా వ్యర్ధాలను నిల్వచేసి గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ ప్రదేశాల్లో వదులుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రసాయన డ్రమ్ములను నిల్వ ఉంచిన ఫంక్షన్ హాలుకు రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నట్టు తేలింది.

సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో మూగజీవాల మృత్యుఘోష వినిపిస్తోంది. రసాయన వ్యర్థ జలాల కారణంగా పాడి పోషణ చేస్తూ బతికే రైతు కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లుతోంది. చింతల శ్రీధర్ కు నల్లకుంట చెరువుపై భాగంలో పశువుల కొట్టం ఉంది. కొన్నేండ్లుగా పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 18 బర్రెలు ఉండగా అందులో ఇప్పటికే 8 చనిపోయాయి. కాలుష్య జలాలే ఇందుకు కారణమని తెలిపారు. ప్రతి సంవత్సరం 10 దూడలు జన్మిస్తాయని, ఇందులో ఒక్కటి బతికితే అదే గొప్ప అన్నట్టుగా పరిస్థితి మారిందని అన్నారు. చెరువు నీళ్లతోపాటు భూగర్భజలాలు పూర్తిగా కలుషితమవడంతోనే మూగ జీవాలు చనిపోతున్నాయని, పీసీబీ అధికారులకు ఫిర్యాదు. చేసినా పట్టించునేవారే కరువయ్యారని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలు తీస్తున్న హెటీరో పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన దూడల తోలుతో మరుగేదెల రూపంలో తయారు చేసిన బొమ్మలను పెట్టి పాలు పిండుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ఊరి చెరువును, భూగర్భ జలాలను రసాయన వ్యర్థాలతో నింపేస్తున్న కంపెనీకి వ్యతిరేకంగా దోమడుగు వాసులు పోరాటానికి సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న హెటిరో ఫార్మా సంస్థ వల్లనే తమ బతుకులు నాశనమవుతున్నామని ఆరోపిస్తున్నారు. ఆ కంపెనీ వదిలిన రసాయన వ్యర్థజలాల కారణంగానే ఉల్లోని నల్లకుంట చెరువు నీళ్లన్నీ గులాబీ రంగులోకి మారాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పిసిబి ఉన్నతాధికారులకు తమ బాధ పట్టించుకునే తీరిక కూడా లేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అండగా ఉంటామంటూ కదిలివచ్చిన ప్రజా సంఘాల మద్దతుతో భవిష్కత్తు కార్యచరణను సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆవిర్భవించింది. ప్రకృతిని, పర్యావరణాన్నిపరిరక్షించుకుంటామని వారంతా ప్రతినబూనారు. పర్యావరణ వేత్తలు నల్లకుంట చెరువును పరిశీలించారు. వ్యవసాయ, వ్యవ అనుబంధ రంగాలే ఆ చెరువుగా జీవిస్తూ. తీవ్రంగా నష్టపోయిన వారితో మాట్లాడారు. వారి ఆవేదనను విన్నారు. చర్మ రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న బాధితులతోనూ చర్చించారు. స్థానికులు సాగిస్తున్న పోరాటానికి తామంతా మద్దతుగా ఉంటామన్నారు. విష రసాయన వ్యర్థ జలాల మనుషులతో పాటు ప్రాణి కోటిపై ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కలపాల బాబూరావు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో కలుష్యానికి కారణమవుతున్న అన్ని కంపెనీలు మూతపడే వరకు పోరాటం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

పారిశ్రామిక వాడలో చాలా రసాయన పరిశ్రమలు తమ అనుమతికి మించి ప్రొడక్షన్ చేయడంతో పాటు గుట్టుచప్పుడు కాకుండా ఇతర రకాల కెమికలు తయారు చేస్తున్నాయనే సమాచారంతో నార్కొటిక్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారానికి స్థానిక అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని, ఆడిటింగ్ సమయాల్లో మాత్రం స్టాక్స్ ను గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలిస్తారని తెలుస్తున్నది. హెటిరోలో ఆడిటింగ్ జరగాల్సి ఉందని అందుకోసమే అక్రమంగా తయారు చేస్తున్న కెమికల్స్ ను బయట ప్రదేశంలో నిల్వచేశారని చేసినట్టు సమాచారం.

దోమడుగు గ్రామంలో కాలుష్య రక్కసికి వ్యతిరేకంగా పోరాడేందుకు వీలుగా కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (కేవీపీసీ)ని ఏర్పాటు చేశాడు. ప్రధాన సలహాదారుడిగా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కలపాల బాబూరావును నియమించారు. గ్రామానికి చెందిన రైతు మెంగని మంగయ్యను కన్వీనరుగా ఎన్నుకున్నారు. బాల్ రెడ్డి, అలేటి జయమ్మ, సర్పంపల్లి శ్రీనివాసరెడ్డి, వి.రాఘవరెడ్డి, ఎం.యాదిరెడ్డి, ఎం.మోహన్ రెడ్డి, చింతల లక్ష్మి, వెంకట్రాంరెడ్డి, కమ్మరి రాజు, అబిశెట్టి శ్రీనివాస్, వడ్ల భాస్కర్, మద్ది ఆనందరెడ్డి, పి. అనురాధ. మంగలి బాలకృష్ణ గౌడ్, గొంది. వెంకటేష్, అంగ రమేష్, జి. కాలేశ్వర్, సీహెచ్, కృష్ణ, సీహెచ్. శోభన్ బాబు, ఎలిమెల మల్లారెడ్డి, ఎం. సత్తిరెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. ఇంతటి కాలుష్యానికి పీసీబీ ఉన్నతాధికారుల అవినీతే ప్రధాన కారణం అంటున్న స్థానికులు. ఈ విషయాన్ని గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి, అటవీ, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, సీఎస్ రామకృష్ణ రావు, ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. పీసీబీ ఉన్నతాధికారుల అవినీతిపై త్వరలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పీసీబీలో జరుగుతున్నా విచ్చలవిడి పర్యావరణ చట్టాల ఉల్లంఘనలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు పర్యావరణ వేత్తలు, మేధావులు, కాలుష్య బాధితులు తెలిపారు.