మాతృభాషని రక్షించుకోవటం అంటే ఆ జాతి మూలాలను కాపాడుకోవడమే అవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. చర్చా కార్యక్రమం అనంతరం సాహితీవేత్తలను సత్కరించారు. సాహితీవేత్తలు తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణ, అమలు మొదలైన అంశాల గురించి సూచనలు చేశారు. తెలుగుభాషకు తెలంగాణ సాహిత్య అకాడమీ చేస్తున్న సేవలను పాలకుర్తి మధుసూదనరావు కొనియాడారు. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు సృజనాత్మక పోటీలు నిర్వహిస్తే తెలుగు భాష బతుకుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భాషలో ఆ జాతి సాంస్కృతిక మూలాలు నిక్షిప్తం చేయబడతాయని సూచించారు. ఇంటి భాష నుంచి బడి భాష వరకు తెలుగు భాషను ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధిస్తే భాష బతుకుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచార్య అనుమాండ్ల భూమయ్య తెలంగాణలో ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెబుతూ ఆ కేంద్రంలో రావాల్సిన ఉండవలసిన విభాగాలను సూచించారు. పాఠ్య పుస్తకాల తయారీ కోసం తెలుగు అకాడమీ ప్రత్యేకంగా పని చేస్తున్నట్లుగా తెలంగాణ భాష, సాహిత్యాల కోసం ఒక పరిశోధన కేంద్రం ఉంటే బాగుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎస్వీ రామారావు, డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి, జి. రామ శర్మ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నరసింహ రెడ్డి పాల్గొన్నారు. సాహితీవేత్తల అందరూ తెలుగు భాష అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.