ఏసీబీ వలలో యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ రామారావు

  • రూ.1.90 లక్షల లంచం డిమాండ్‌
  • రెండ్‌హ్యాండెడ్‌గా అధికారులకు చిక్కిన దేవస్థాన అధికారి
  • ఇండ్లలో కొనసాగుతున్న సోదాలు

యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ వూడెపు రామారావు ఏసీబీకి చిక్కాడు. బుధవారం హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లోని మేడిపల్లి మెడికల్‌ షాపు వద్ద గుత్తేదారుడి నుంచి రూ. 1.90 లక్షలు లంచం తీసుకుంటుండగా నల్లగొండ ఏసీబీ డీఎస్సీ, సీఐ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. యాదగిరిగుట్ట దేవస్థానంలోని లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి సంబంధించిన టెండర్‌ను రూ.10 లక్షలకు ఓ గుత్తేదారు స్వాధీనం చేసుకున్నాడు. ఈ టెండర్‌ వ్యవహారం ఈఈ రామారావు ఆధీనంలో ఉంది. దీంతో తనకు రూ. 2 లక్షల ఇవ్వాలని గుత్తేదారుడిని డిమాండ్‌ చేసి, బిల్లులను నిలిపివేశారు.

గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మేడిపల్లిలోని ఓ మెడికల్‌ షాపు వద్ద గుత్తేదారు నుంచి ఈఈ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈఈ రామారావు ఇల్లు, కొండపైన ఆలయ కార్యాలయంతోపాటు వారి బంధువుల ఇండ్లలో సోదాలు చేపట్టారు. రామారావు ఇటీవల దేవస్థానంలో ఈవోకు సంబంధం లేకుండానే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించి అక్రమాలకు పాల్పడిన ఆరోపణపై సస్పెండ్‌ అయ్యాడు. అనంతరం ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి సహాయంతో రూ. 50 లక్షల లంచమిచ్చి ఉద్యోగంలో చేరినట్టు ఆరోపణలున్నాయి.