ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు కాలే యాదయ్య, రాంమోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరియు కుమార్తె గడ్డం శ్రీ అనన్య తో కలిసి బస్సును టిప్పర్ లారీ డీకొన్న సంఘటన స్థలాన్ని పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అధికారులను అడిగి దుర్ఘటన వివరాలను తెలుసుకున్నారు.

ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్ లారీ డీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు, తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , రాష్ట్ర పరిశ్రమలు, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం, RTC తరుపున 7 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు నష్ట పరిహారం ప్రకటించింది. హైదరాబాద్ బీజాపూర్ హైవే లో భాగమైన పోలీసు అకాడమీ నుండి మన్నెగూడ వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి, టెండర్ ప్రాసెస్ పూర్తి చేసినా గత ప్రభుత్వం పదేళ్లు నిర్లక్ష్యం చేయడం కారణంగానే రోడ్డు విస్తరణ జరుగలేదు.

ఈ రోడ్డు పనులు ప్రారంభించాలని నేను రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రోడ్డు విస్తరణకు సంబంధించి కొంతమంది ప్రకృతి ప్రేమికులు చెట్లను తొలగించవద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. అందుకే పనులు ఆలస్యం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కృషితో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పరిష్కారం అయింది. మూడు రోజుల నుండి పనులు మొదలయ్యాయి. రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయించి సాధ్యమైనంత వరకు ఏడాది కాలంలోనే అందుబాటులోకి తెస్తాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.