- తెలంగాణ టెక్నాలజీ, ఆవిష్కరణలకు గుర్తింపు
 - ప్రపంచ స్థాయి కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్
 - ఫ్యూచర్ సిటీలో వాన్ గార్డ్ సొంత సెంటర్ ను నిర్మించాలి
 - వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
 
హైదరాబాదులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం అంటే రాష్ట్రంలో టెక్నాలజీ, ఆవిష్కరణలకు ఒక గుర్తింపుగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సాయంత్రం నాలెడ్జ్ సెంటర్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ ఒక కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం అన్నారు. హైదరాబాదులో వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రజల తరఫున వాన్ గార్డ్ నాయకత్వ బృందానికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, కంపెనీ చరిత్రలో ముఖ్యమైన మైలురాయికి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అని సిబ్బందిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్రసంగించారు. పెట్టుబడుల నిర్వహణలో వాన్ గార్డ్ ఒక విశ్వసనీయ గ్లోబల్ నాయకుడు, కొత్త ఆవిష్కరణలు, నైతికత, మరియు దీర్ఘకాలిక విలువ సృష్టి పట్ల కట్టుబాటుతో ప్రసిద్ధి చెందింది అన్నారు.
వాన్ గార్డ్ హైదరాబాదులో గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను స్థాపించాలనే నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో టెక్నాలజీ మరియు ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతున్న భాగ్యనగరం ప్రతిష్టకు గొప్ప గుర్తింపు అని అభివర్ణించారు. బలమైన మౌలిక వసతులు, వ్యాపారానుకూల విధానాలు, మరియు ప్రతిభతో నిండిన ఎకోసిస్టమ్ కారణంగా, ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ ప్రాధాన్య గమ్యస్థానంగా ఎదిగింది అని వివరించారు. దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ విద్యాసంస్థలు ఉన్న నగరంగా, ప్రతి సంవత్సరం వేలాది మంది నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులను హైదరాబాద్ అందిస్తుంది అని తెలిపారు. అత్యున్నత ప్రతిభా వనం, స్టార్టప్ సంస్కృతి, పరిశ్రమ, అకాడమి ల సమన్వయం, ఇవన్నీ వాన్ గార్డ్ వంటి సంస్థలు అభివృద్ధి చెందడానికి హైదరాబాద్‌ను సరైన ప్రదేశంగా మార్చుతున్నాయి అన్నారు. జీవితాలు మరియు ఆర్థిక వ్యవస్థలను మార్గనిర్దేశం చేయడంలో సాంకేతిక శక్తిపై తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విశ్వాసం ఉంచింది ఆ మేరకు ముందుకు పోతుంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, గ్లోబల్ AI స్కూల్ వంటి కార్యక్రమాల ద్వారా మేము ఆవిష్కరణ, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే వ్యవస్థను నిర్మించాము అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఇవన్నీ ప్రపంచ స్థాయి సంస్థలకు తెలంగాణలో వ్యాపారం చేసే వేదిక మాత్రమే కాకుండా, అభివృద్ధిలో భాగస్వామిని కూడా అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నా సహచరుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ & కామర్స్ మరియు లెజిస్లేటివ్ వ్యవహారాల శాఖల మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబును కూడా ప్రస్తావించదలిచాను అన్నారు.
శ్రీధర్ బాబు నాయకత్వంలో మా రాష్ట్రం టెక్నాలజీ మరియు పరిశ్రమ రంగాల్లో విశేష పురోగతి సాధిస్తోంది అని అభినందించారు.
ఈ కొత్త అధ్యాయాన్ని ముందుకు నడిపించే వాన్ గార్డ్ ప్రతిభాశాలి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అన్నారు. వాన్ గార్డ్ సిబ్బంది నైపుణ్యం, శక్తి, కట్టుబాటు ఇవే మీ వాంగార్డ్ విజయానికి పునాది అని డిప్యూటీ సీఎం వివరించారు. మీరు వాంగార్డ్ మాత్రమే కాదు, విశాలమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ భవిష్యత్తును రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. వాన్ గార్డ్ బృందానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, మా విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్‌లతో మరింత సహకార అవకాశాలను వాన్ గార్డ్ పరిశీలించాలనీ ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. కలిసి పనిచేస్తూ, గ్లోబల్ మార్కెట్లకు మాత్రమే కాదు, స్థానిక సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడే పరిష్కారాలను రూపొందించగలుగుతాం అని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాదులో భవిష్యత్తు సిటీగా అభివృద్ధి చెందుతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్థలాన్ని తీసుకొని, వాన్ గార్డ్ సొంత సెంటర్ నిర్మించే అంశంపై లోతుగా ఆలోచన చేయాలని నిర్వాహకులను కోరుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాదులో నిర్మితమవుతున్న కొత్త నగరం భారత్ ఫీచర్ సిటీ భారతదేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటుంది అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సదుపాయాలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో వాన్ గార్డ్ సొంత కేంద్ర నిర్మాణానికి సంబంధిత మంత్రులు చొరవ చూపాలని తాను కోరుతున్నానని అన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, కంపెనీ ప్రతినిధులు నితిన్ థండన్, వెంకటేష్, జాన్, కిమ్ తదితరులు పాల్గొన్నారు.