ఏఐలో ఆవిష్కరణల వేదికగా రాష్ట్రం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కృత్రిమ మేథస్సు రంగంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కొత్తగా తెలంగాణా ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ హబ్ (TAIH) ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. 2035 నాటికి ప్రపంచంలోని 20 అతి పెద్ద ఏఐ హబ్ లలో తెలంగాణాకు స్థానం కల్పించడమే దీని ఏర్పాటు వెనక ఉన్న ప్రధాన లక్ష్యమని మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
• ఇందులో ఐటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మీ సేవ కమిషనర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
• ‘భవిష్యత్తు అంతా కృత్రిమ మేథ రంగానిదే. ఇది విస్మరించలేని నిజం. దానికి అనుగుణంగా ఏఐలో పరిశోధన, ఆవిష్కరణల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలో కృత్రిమ మేథ అంటే మొట్ట మొదటగా తెలంగాణా మాత్రమే గుర్తుకొచ్చేలా విస్తృత ఎకోసిస్టంను నెలకొల్పుతున్నాం. సిఎం రేవంత్ రెడ్డి ఆలోచనలలో భాగంగా ఏఐ ఇన్నోవేషన్ హబ్ తుదిరూపు దాల్చింది.
• పౌర సేవలు, ఆరోగ్యం, రవాణా, విద్యా రంగాల్లో ఏఐ పరిష్కారాలతో పరివర్తనాత్మక ఫలితాలు (transformative results) సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇ-గవర్నెన్స్ లో ఏఐ ఆధారిత సేవలను వినియోగిస్తాం. దేశంలో తెలంగాణా అగ్రస్థానంలో ఉండేలా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. దీని ద్వారా పాలనలో మరింత పారదర్శకత కూడా సాధ్యమవుతుంది.
• 2024 లో ఏఐ గ్లోబల్ సమిట్ నిర్వహించాం. ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన మొదటి రాష్ట్రంగా అందరి దృష్టిని ఆకర్షించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో డిపిఐ (Digital Public Infrastructure -DPI) ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానిది. తెలంగాణా డేటా ఎక్ఛ్సేంజి (TGDeX) ఇప్పటికే పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ట్రిపుల్ ఐటి, బిట్స్, ఐఎస్ బి, నల్సార్, హైదరాబాద్ ఐఐటి, సి-డాక్ తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం’.