వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరిగిన 74 వ ఎపిసోడ్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖమాత్యులు తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిధిగా పాల్గొని రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భముగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవడం వలన వారి భూములలో ఎంత శాతం పోషకాలు ఉన్నాయో తెలుస్తాయని, తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఇంకా ఎంత మోతాదులో ఎరువులు వాడవలెనో తెలుస్తున్నదని, కావున భూసార పరీక్ష పత్రం ఆధారంగా ఎరువుల వాడకం వలన రైతులకు ఎరువులపై ఖర్చు తగ్గడమే కాకుండా భూమి యొక్క ఆరోగ్యం కూడా కాపాడినట్లు అవుతుందని తెలియజేసారు. అదే విధముగా నీటి వసతి కలిగిన ప్రతి రైతు వరి, పత్తి పంటల బదులు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాలని, దాని ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నదని, ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కోకో, మిరియాలు, వక్క, సాగు చేయడం వలన ఒకే భూమిలో ఎక్కువ రకాలైన పంటల సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలియజేసినారు. ఈ సందర్భముగా మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ఆర్. గోపాల్ రెడ్డి, నల్గొండ జిల్లా నుండి రామ చంద్రా రెడ్ది విజయ గాధలను రైతులందరితో పంచుకోవడం జరిగినది. భూసార పరీక్ష పత్ర ఫలితాల ద్వారా ఎరువులు వాడుకునే విధానం గురించి వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డా. మాధవి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరక్టర్ డా. బి. గోపి ఐ ఏ ఎస్, ఉద్యాన శాఖ డైరక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా ఐ ఏ ఎస్, మార్కెటింగ్ శాఖ డైరక్టర్ శ్రీమతి లక్ష్మి బాయి, మరియు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ ఉన్నత్తాధికారులు, రైతులు పాల్గొన్నారు.