ప్యూజన్ ల్యాబ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం: జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పరిధిలో గల ప్యూజన్ ల్యాబ్స్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్, నల్లగొండ ఆర్డీవో అశోక్ రెడ్డి అన్నారు. గత నెలలో నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, పిటంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లకు చెందిన గొర్రెలు ప్యూజన్ ల్యాబ్స్ కంపెనీ ద్వారా వెలువడిన విష పదార్థాలను పిట్టంపల్లి పరిసర ప్రాంతంలో వదిలేసి వెళ్లడం మూలంగా గ్రామానికి చెందిన గొర్రెలు వాటిని తిని మృత్యువాత పడగా దానిపై జిల్లా కలెక్టర్ కమిటీ వేసి విచారించాల్సిందిగా ఆదేశించడంతో పశుసంవర్ధక శాఖ జెడి జీవీ రమేష్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యు లు గురువారం పిట్టంపల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత గొర్రెల కాపరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఠంపల్లి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ప్యూజన్ ల్యాబ్స్ కెమికల్ పదార్థాలను వదిలి వెళ్ళడంతో గొర్రెలు తిని 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయని దీని వల్ల గొర్రెల కాపర్లు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని తెలిపారు. ఇట్టి విషయంపై నష్టపోయిన గొర్రెల కాపరులకు నష్టపరిహారాన్ని ఇప్పించే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందన్నారు. కంపెనీ విష పదార్థాలు తిని సుమారు 30 గొర్రెలు మృత్యువాత పడడంతో వెటర్నరీ సిబ్బందితో మృత్యువాత పడ్డ గొర్రెలకు అయ్యే నష్టపరిహారాన్ని అంచనా వేశారు. మొత్తం 30 గొర్రెలకు గాను 6 లక్షల 30 వేల రూపాయలు నష్టపరిహారాన్ని ఇప్పించేలా నల్లగొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా సంబంధిత ప్యూజన్ ల్యాబ్స్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి చర్యలకు పాల్పడిన కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు అన్ని కంపెనీలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, చిట్యాల ఇంచార్జి తహసిల్దార్ విజయ, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ వెంకన్న, ఏఇఎస్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.