ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా కృషి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, ఇందులో 73,696 మంది రైతులు భాగస్వామ్యమయ్యారని తెలిపారు. 2021-22 నుండి ఇప్పటి వరకు 2.28 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఎకరాల లక్ష్యం నిర్ధేశించగా, ఇప్పటివరకు 31,158 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగినట్టు చెప్పారు. మార్చి నాటికి మిగిలిన 93,842 ఎకరాలు సాగులోకి రావాల్సి ఉందని సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ “రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుకు 12 లక్షలకు పైగా అనువైన భూమి ఉంది. వచ్చే నాలుగు సంవత్సరాలపాటు ప్రతి ఏడాది రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పని చేయాలి. మూడు సంవత్సరాల్లో పది లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుతో తెలంగాణ దేశంలోనే ఆయిల్ పామ్ ఉత్పత్తిలో మొదటి రాష్ట్రంగా నిలుస్తుంది” అని అన్నారు.

గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి 6.54 లక్షల ఎకరాల లక్ష్యం కేటాయించగా, కేవలం 2.28 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చిందని తెలిపారు. ఆయిల్ పామ్ విస్తరణలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తక్కువ పురోగతి ఉన్న జిల్లాలుగా వరంగల్, నారాయణపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, గద్వాల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలను గుర్తించినట్టు తెలిపారు. ఈ జిల్లాల్లో ఆయా కంపెనీలు లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో కంపెనీలు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, ప్రతి కంపెనీ తమ పరిధిలోని జిల్లాల్లో సరిపడా సిబ్బందిని నియమించుకొని, రైతులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలని సూచించారు. తోటల యాజమాన్యంలో నీటి వినియోగం, ఎరువుల పంపిణీ, అంతర పంటలు, కలుపు నివారణ వంటి అంశాలపై పూర్తి దృష్టి సారించాలని చెప్పారు. కొత్త తోటలలో గెలల దిగుబడులు తగ్గకుండా పర్యవేక్షణ చేయడం, విజయవంతమైన రైతుల అనుభవాలను కొత్త రైతుల ప్రోత్సాహానికి వినియోగించడం అవసరమని సూచించారు. తక్కువ ఎత్తు, తక్కువ ఆకు పొడవు, అధిక దిగుబడి ఇచ్చే కొత్త వేరైటీ మొలకలను దిగుమతి చేసుకోవాలని, రాబోయే ఏడాదికి ఆయిల్ పామ్ మొక్కల డిమాండ్ పెరగనున్నందున ప్రతి కంపెనీ తన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలను ఏర్పాటు చేసుకొని, నాణ్యమైన మొక్కలు రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల సందేహాల నివృత్తి కోసం కంపెనీలు తమ పరిధిలో రైతు సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతు వేదికల కార్యక్రమాల్లో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొని రైతులతో చర్చించాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో విజయవంతమైన రైతులను ప్రతి రైతువేదిక కార్యక్రమంలో మాట్లాడించేందుకు ప్రయత్నించాలన్నారు. వచ్చే సంవత్సరానికల్లా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆయిల్ పామ్ విస్తరణలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తక్కువ పురోగతి ఉన్న జిల్లాలపై ఉద్యానశాఖ సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, ప్రతి జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా విస్తరణ కార్యక్రమాలు జరిగేటట్టు మార్గదర్శనం చేయాలన్నారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల పురోగతిపై మంత్రి సమీక్షిస్తూ, త్వరలో ప్రారంభం కానున్న ఫ్యాక్టరీల వివరాలు వెల్లడించారు. నర్మెట్ట (సిద్దిపేట)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 30-120 టన్నుల సామర్థ్యంతో నవంబర్ 2025లో, పెద్దపల్లి జిల్లాలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ 15 టన్నుల సామర్థ్యంతో జనవరి 2026లో, ఖమ్మంలో గోద్రేజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ 15-60 టన్నుల సామర్థ్యంతో జనవరి 2026లో, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ 15-30 టన్నుల సామర్థ్యంతో ఫిబ్రవరి 2026లో, కల్లూరు గూడెం (ఖమ్మం)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 15-60 టన్నుల సామర్థ్యంతో జూన్ 2026లో, బీచుపల్లి (గద్వాల్)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 15 టన్నుల సామర్థ్యంతో జూన్ 2026లో, ములుగు జిల్లాలో కె.ఎన్ బయో సైన్సెస్ ఫ్యాక్టరీ 10 టన్నుల సామర్థ్యంతో ఆగస్టు 2026లో ప్రారంభం కానున్నట్లు వివరించారు. “రాష్ట్రాన్ని ఆయిల్ పామ్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడం ద్వారా రైతుల ఆదాయ వనరులు పెంచడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆయిల్ పామ్ విస్తరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రైతుల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.