ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో రానున్న రోజులలో త్రాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్ విభాగం (HMWS&SB) పని తీరుపై సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంజీర, సింగూరు, గోదావరి Phase-2, Phase-3 పనులపై సమీక్ష చేశారు. భూసేకరణ, పైప్ లైన్ల నిర్మాణం పై అధికారులతో చర్చించారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, రోడ్లు, భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ నిర్దేశించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సహకరించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హైదరాబాద్ వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, HMDA కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, PCCF డాక్టర్ సి. సువర్ణ, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.