హైదరాబాద్: ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21 తేదీన రాష్ట్రపతి, హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకోని, ఆయా డిపార్ట్ మెంట్ల వారీగా నోడల్ ఆఫిసర్ ను నియమించి నిబంధనల ప్రకారం తగు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని తదనంతరం రాజ్ భవన్ లో స్వల్ప విశ్రాంతి, గవర్నర్ High Tea లో పాల్గొని, అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8.00 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరుతారని అధికారులు పేర్కొన్నారు. బ్లూ బుక్, VVIP ప్రొటోకాల్ మాన్యువల్ ప్రకారం తగు భద్రతా, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్త్ ప్రణాళికను పోలీస్ శాఖ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వివిఐపిలకు తగు భద్రతా ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. జి.ఎ.డి., ఫైర్ సర్వీస్, రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య, మున్సిపల్, ఇంధన, బి.ఎస్.ఎన్,ఎల్, హార్టి కల్చర్ విభాగాలు నిర్దేశించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.
రాష్ట్రపతి ఈ నెల 21 తేదీన మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని స్వల్ప విరామం కోసం రాజ్ భవన్ లో బస చేసి, అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేసి 22వ తేదీ ఉదయం పుట్టపర్తి పర్యటనకు బయలుదేరుతారని అధికారులు పేర్కొన్నారు. పై రెండు కార్యక్రమాలలో అన్ని సంబంధిత డిపార్టుమెంట్ అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా ప్రతి ఏర్పాటును స్వయంగా పర్యవేక్షించాలని, ప్రస్తుత పరిస్థితులల్లో భద్రతా పరంగా మరింత శ్రద్ధతో ఏర్పాట్లు చేయాలని కోరారు.
రామోజీ ఫిల్మ్ సిటీ లో కార్యక్రమ నిర్వహణకు సంబంధిత నిర్వహకులు ఉప రాష్ట్రపతి కార్యాలయం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రాజ్ భవన్లో ఏర్పాట్లు, సన్నద్దతపై తగు చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్ జాయింట్ సెక్రెటరీని కోరారు. మిలటరీ, ఏయిర్ పోర్టు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రెండు కార్యక్రమాలలో ప్రోటోకాల్, భద్రత ఏర్పాట్లు సజావుగా ఉండాలని, కార్యక్రమానికి ముందు రోజున ASL, ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావు, అదనపు డిజిపిలు విజయ్ కుమార్, మహేష్ భగవత్,GHMC కమీషనర్ ఆర్.వి.కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ Ch. ప్రియాంక, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, ప్రొటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
