గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన

గోదావరి జలాలు కలుషితం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరుతోపాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, రసాయన వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారకాలని పేర్కొంది. వానకాలంలో ఘన వ్యర్థాలు నీటితోపాటు ప్రవహించి గోదావరిలో కలిసి కలుషితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోని సమస్య మాత్రమే కాదని, గోదావరి పరీవాహక ప్రాంతమంతటా విస్తరించిందని పేర్కొంది.

గోదావరి నది, దాని ఉప నదులు, వాగులు, కాలువలలోకి శుద్ధిచేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడాన్ని అరికట్టేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం దౌడేపల్లికి చెందిన ఆకుల సంపత్‌కుమార్‌ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నది పరీవాహకం వెంట మురుగునీటి శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాలుష్యనియంత్రణ మండలిని ఆదేశించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి తరఫు న్యాయవాది వాదిస్తూ.. గోదావరి కాలుష్య నియంత్రణకు తమ బోర్డు పరిశీలన చేస్తున్నదని చెప్పారు. ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ.. పిల్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.