సౌదీ అరేబియాలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు దగ్ధమై పలువురు భారతీయులు మరణించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా చేరేందుకు బయలుదేరిన భక్తులు ఇంత భయానక ప్రమాదానికి గురవడం కలచివేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు ఉన్నారన్న సమాచారం మరింత విషాదకరమని తెలిపారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే, ప్రమాద వివరాల గూర్చి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు సౌదీ అధికారులతో అలాగే డిల్లీ లో విదేశాంగ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారని, మంత్రి అడ్లూరి చెప్పారు. మృతదేహాల గుర్తింపు, సహాయక చర్యలు త్వరగా చేపట్టాలని అధికారులను సీఎం గారు ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు.బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వము అవసరమైన ప్రతి సహాయం చేయనున్నాయని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.