జాతీయ రహదారి 516–ఇ కి అటవీ అనుమతులు

చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరంవరకు నిర్మించే మరో జాతీయ రహదారి (516 –ఇ)కి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో రహదారి నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, రంపచోడవరం నుంచి కొయ్యూరు, కొయ్యూరు నుంచి లంబసింగి, లంబసింగి నుంచి పాడేరు, పాడేరు నుంచి అరకు, అరకు నుంచి గౌడార్‌ మీదుగా శృంగవరపు కోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం రూ. 1,500 కోట్ల అంచనాలతో 406 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు తయారుచేసి కేంద్రానికి సమర్పించింది. ఇందులో మొదటగా మూడు ప్యాకేజీల కింద 137 కిలోమీటర్లకు గాను రూ. 457 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది.