‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

  • ఏటా 10 లక్షల మంది యువతకు ‘ఏఐ’పై శిక్షణ
  • మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం
  • ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్
  • ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏటా 10 లక్షల మంది తెలంగాణ యువతను ‘ఏఐ’ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెటా, మీ సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ను మంగళవారం బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణాలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ‘గవర్నెన్స్’ అంటే కేవలం నాలుగు గోడల మధ్య పాలించడం కాదన్నారు. రాచరిక పోకడలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసేలా వ్యవహరించిందన్నారు. ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేస్తూ… టెక్నాలజీ సాయంతో పౌర సేవలను వారి ముంగిటకే చేరుస్తూ ‘గుడ్ గవర్నెన్స్’వైపు అడుగులు వేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం టెక్నాలజీని కేవలం సాఫ్ట్ వేర్ గా మాత్రమే చూడటం లేదని, ఒక సమానత్వ సాధనంగా చూస్తున్నామన్నారు. టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ ఛేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ తో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో తెలంగాణ ఒక బెంచ్ మార్కెట్ ను సెట్ చేస్తోందన్నారు. తాజాగా ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించేలా మీ సేవ ద్వారా అందించే 580కు పైగా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన పౌర సేవలను ఫింగర్ టిప్స్ పై వాట్సాప్ లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ డిజిటల్ యుగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జెన్ ఏఐ, మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ద్వారా పౌర సేవల డెలివరీ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత ‘తెలంగాణ’కే దక్కిందన్నారు. త్వరలోనే తెలుగు, ఉర్దూలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ వాట్సాప్ సేవలను విస్తరిస్తామన్నారు. టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్ తోనే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మీ సేవ కమిషనర్ రవి కిరణ్, మెటా ప్రతినిధి నటాషా తదితరులు పాల్గొన్నారు.