మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌

మావోయిస్టు పార్టీ కీలక నేత, పీపుల్స్‌ గెరిల్లా సుప్రీం లీడర్‌, ఎర్రదళం సేనాధిపతి మద్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అతనితోపాటు భార్య రాజే పోలీసుల తూటాలకు నేలకొరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిన సేనాధిపతి హిడ్మాపై డేగ కన్నెసి, అనేక కోవర్టు ఆపరేషన్లు జరిపిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని మారెడుమిల్లి అడవుల్లో అతని ప్రస్థానానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి మండలం టైగర్‌ జోన్‌ ప్రాంతంలోని నల్లూరు జలపాతం వద్ద పోలీసులు మంగళవారం జరిపిన కాల్పుల్లో హిడ్మాతోపాటు ఆయన భార్య రాజే(డీవీసీఎం), లక్మల్‌ అలియాస్‌ చైతు, మల్లా అలియాస్‌ మల్లలు, కమ్లూ అలియాస్‌ కామ్లేశ్‌ మృతిచెందారు. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడినైట్లెంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ కేంద్రంగా ఉన్న తమ స్థావరాలను మరో రాష్ర్టానికి మార్చే ప్రయత్నంలోనే ఈ కౌంటర్‌ జరిగినట్లు భావిస్తున్నారు. అంతేకాదు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాల్లో ఉన్న ఆనవాళ్లు సైతం అనుమానాస్పదంగానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గెరిల్లా పోరాటాల్లో మాస్టర్‌మైండ్‌గా పేరున్న మద్వి హిడ్మా (51) తలపై సుమారు కోటి రూపాయల రివార్డు ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని భార్య రాజే తలపై కూడా సుమారు రూ.50 లక్షల రివార్డు ఉన్నది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు ఏపీ డీజీపీ హరీశ్‌గుప్తా మీడియాకు తెలిపారు. అతనితోపాటు ఉన్న మిగిలిన మావోయిస్టు కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికలపై సమాచారం ఉండటం వల్లనే టార్గెట్‌ను రీచ్‌ అయ్యామని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 2 ఏకే 47 రైఫిల్స్‌, ఒక పిస్టల్‌, ఒక రివాల్వర్‌, ఒక సింగిల్‌ బోర్‌ వెపన్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఏకే 47కి సంబంధించిన 28 రౌండ్ల బుల్లెట్లు, పిస్టల్‌కు చెందిన 5 రౌండ్ల బుల్లెట్లు, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, నాన్‌ ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, ఫ్యూజ్‌ వైర్లు, ఏడు కిట్‌బ్యాగ్‌లు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.