- దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సీఈఓ లను ఆహ్వానించి పెద్ద పండుగలా గ్లోబల్ సమ్మిట్
- మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధనలో ప్రతి శాఖ భాగస్వామి కావాలి
- భవిష్యత్తు తరాలకు మేలు చేకూర్చేలా విజన్ డాక్యుమెంట్
- గ్లోబల్ సమ్మిట్ కు దేశంలోని ప్రముఖులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆహ్వానిస్తున్నాం
- 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన వార్ రూమ్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
యువ రాష్ట్రం తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రజాభవన్ లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి ఏర్పాటు చేసిన 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ సమావేశ మందిరంలో ప్రసంగించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధన సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ కల. ఆ కల సాధనకు ప్రతి ఒక్కరం ఆలోచిస్తున్నాం అడుగులు వేస్తున్నాం, ఈ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించారని డిప్యూటీ సీఎం వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ISB తో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖల నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ISB బృందం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది, గ్లోబల్ సమ్మిట్ వచ్చేనెల 8, 9 తేదీల్లో జరగనుంది, తక్కువ సమయం అందుబాటులో ఉన్నందున పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డాక్యుమెంట్ ను తుది దశకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, వాటి అమలు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామని తెలిపారు. డిసెంబరు 9 తో ప్రజా ప్రభుత్వం రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు సంవత్సరాల్లో ఏం చేశామని చెప్పడం కంటే కూడా భవిష్యత్ తరాలకు మేలు చేకూరేలా ఏ విధమైన పునాదులు వేయబోతున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం అనే విషయాలను ప్రపంచానికి విజయం డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నట్టు తెలిపారు. ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసు సెక్టార్లలో GDP నీ పెంచి 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించిందని వివరించారు. ప్రజా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఆయా శాఖల ద్వారా వ్యవస్థీకృతమైన పనులు ఏ పద్ధతుల్లో చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం అనేది వివరించడానికి కొంతకాలంగా డిజైన్ డాక్యుమెంట్ పై కసరత్తు జరుగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రభుత్వం ఏ లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతుందో వాటికి అధికారులంతా సహకరించి నిబద్ధతతో పనిచేశారు ఈ సందర్భంగా అందరికీ అభినందనలు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ రెండు సంవత్సరాల్లో కనబరిచిన నిబద్దతతోనే 2047 డాక్యుమెంట్ రూపకల్పనకు అడుగులు ముందుకు వేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు.
2047 విజన్ డాక్యుమెంట్, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనే లక్ష్యాలు అసాధారణమైనవి అని అందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రంలో అన్ని రకాలుగా అనువైన వాతావరణం ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు.
గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో మంచి వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఫార్మా, ఐటీ రంగాలకు దేశంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఉందని తెలిపారు. ఇవన్నీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని వివరించారు. ఈ అంశాలన్నీ విజన్ డాక్యుమెంట్లో పకడ్బందీగా చోటు కల్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు. 36 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే దేశంలోని ఏ రాష్ట్రము తెలంగాణతో పోటీ పడలేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 39 రేడియల్ రోడ్లు, వాటిని కలుపుతూ పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు రానున్నాయని వివరించారు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులు రానున్నాయి వాటిని పంది పుచ్చుకొని ప్రణాళికలు రూపొందించుకునేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ISB నిపుణులతో సమన్వయం చేసుకుంటూ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరచాలని సూచించారు. అన్ని శాఖల కార్యదర్శులు విజయం డాక్యుమెంటుకు సంబంధించి తమ తమ శాఖల మంత్రులతో భేటీ అయి కసరత్తు చేయాలని మంత్రులు సూచించే సలహాలను విజయం డాక్యుమెంట్ లో జోడించాలని డిప్యూటీ సీఎం సూచించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది వివరించేందుకు దేశంలో అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నామని అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కంపెనీల సీఈఓ లను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ ను పెద్ద పండుగలా నిర్వహించనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని సంపద, వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చూపడమే కాదు వాటిని ఏ విధంగా కార్యరూపం దాలుస్తామో కూడా అధికారులు ఇజం డాక్యుమెంట్ లో చూపించాలని పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 13 శాతం జిడిపి లక్ష్యసాధనలో ప్రతి శాఖ పాత్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిడిపి న 11 శాతం నుంచి 13 శాతానికి ఒకేసారి పెరగడం అంటే ఎంతో తీవ్రంగా ఆలోచించి అధికారులు బలమైన డాక్యుమెంట్ రూపొందించాలని, ఏ విధంగా 13 శాతం జిడిపిని చేరుకోబోతున్నాము వివరించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. గురువారం అంతా శాఖల కార్యదర్శులు మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్ ను తుది దశకు తీసుకురావాలి, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు కూర్చుని కసరత్తు చేసి విజన్ డాక్యుమెంట్ కు ఆమోదం తెలియజేస్తారని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు సీరియస్గా తీసుకొని ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి వేగంగా డాక్యుమెంట్ రూపకల్పన కార్యక్రమం పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని అందుకు రెండు ఉదాహరణలు డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణంలో పెద్దగా ప్రగతి లేదన్న ప్రచారం ఉంది, ఇదే విషయంపై తాను కసరత్తు చేసి ఆర్థిక శాఖలో పూర్తి వివరాలు తీసుకోగా రెండు సంవత్సరాలు కాలంలో కేవలం రోడ్లు భవనాల శాఖలో 85 వేల కోట్లకు సంబంధించిన పనుల నిర్మాణం, కొన్ని ఆమోదం, మరి కొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయి అన్నారు. 85 వేల కోట్లతో చేపడుతున్న రోడ్ల పనులు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది, దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదు అన్నారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో డ్వాక్రా మహిళలకు 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందజేసింది అన్నారు. ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల సభ్యులకు అందజేయను ఉన్నామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ జయేష్ రంజన్, సంజయ్ కుమార్, వికాస్ రాజ్, ఉన్నతాధికారులు శ్రీధర్, మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తాన్య, నవీన్ మిట్టల్, హరీష్,, బుద్ధ ప్రకాష్, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ, నాగిరెడ్డి, చౌహన్ తదితరులు పాల్గొన్నారు.
