మ‌హిళా ఉత్ప‌త్తుల మార్కెటింగ్‌కు అమెజాన్‌తో ఒప్పందానికి సంప్ర‌దింపులు:

  • మ‌హిళా సంఘాల‌కు పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, బ‌స్సులు
  • తెలంగాణ సంప్ర‌దాయానికి అనుగుణంగా చీరెల పంపిణీ
  • మ‌హిళ‌ల ఉన్న‌తి-తెలంగాణ ప్ర‌గ‌తి పేరిట ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల పంపిణీ
  • మ‌హిళా సంఘాల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాన‌మంత్రి ఇందిరాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్ర‌హానికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డ ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల పంపిణీని ప్రారంభించారు. అనంత‌రం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి జిల్లాల్లోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల (ఎస్‌హెచ్‌సీ) స‌భ్యుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. తెలంగాణ‌లోని ఆడ బిడ్డ‌ల‌కు పుట్టింటి వాళ్లు.. అన్న‌ద‌మ్ములు సారె చీరె పెట్ట‌డం సాంప్ర‌దాయ‌మ‌ని… అలాగే రాష్ట్రంలోని ప్ర‌తి ఆడ‌బిడ్డ‌ను తోబుట్టువుగా భావించి త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం అర్హులైన ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందిస్తుంద‌ని సీఎం అన్నారు. తెలంగాణ‌లోని అర్హులైన కోటి మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం తెలిపారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌హిళా ఉన్న‌తి.. తెలంగాణ ప్ర‌గ‌తి పేరిట చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాలన్నారు. ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కార్య‌క్ర‌మాన్ని పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాల‌ని… ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని సీఎం సూచించారు. న‌వంబ‌రు 19 నుంచి డిసెంబ‌రు 9 వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీ పూర్తి చేయాల‌ని.. ఇందుకు 65 ల‌క్ష‌లు అందుబాటులో ఉంచామ‌ని సీఎం తెలిపారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు 35 ల‌క్ష‌లు చీర‌లు పంపిణీ చేయాల‌ని సీఎం ఆదేశించారు. అర్హులైన ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందుతుంద‌ని… ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన సామాజ‌క, ఆర్థిక‌, విద్యా, ఉపాధి, రాజ‌కీయ‌ కుల స‌ర్వే (సీపెక్‌) డాటాను ద‌గ్గ‌ర పెట్టుకొని ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందెలా చూడాల‌ని.. చీర అందించే స‌మ‌యంలో ఆధార్‌ను తీసుకోవాల‌ని.. ముఖ గుర్తింపు చేప‌ట్టాల‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.

అవ‌కాశం ఉన్న‌చోట‌ల్లా మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహం..
మ‌హిళ‌ల ఉన్న‌తే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం వ‌డ్డీలేని రుణాల విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని… తాము వ‌డ్డీలేని రుణాలు ఇవ్వ‌డంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుద‌ల చేసిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించ‌డ‌మే కాకుండా ఆర్టీసీ బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జమానుల‌ను చేశామ‌ని సీఎం తెలిపారు. యూనిఫాంలు కుట్టే బాధ్య‌త‌ను అప్ప‌జెప్ప‌డంతో మ‌హిళా సంఘాల‌కు రూ.30 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని, అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల క‌మిటీల ద్వారా పాఠ‌శాలల్లో రూ.534 కోట్ల ప‌నులు చేప‌ట్టామ‌ని, ధాన్యం కొనుగోళ్లు మ‌హిళా సంఘాల‌కే అప్ప‌జెప్పామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పారామం ప‌క్క‌న రూ.వంద‌ల కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామ‌ని సీఎం అన్నారు. మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న ఉత్ప‌త్తుల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్ క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ మ‌హిళ‌ల గౌర‌వం పెంచాల‌నే ఉద్దేశంతోనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌డుతోంద‌న్నారు. రేష‌న్ కార్డు ఉన్న మ‌హిళ‌లంద‌రికీ చీర‌లు అందిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. మంత్రి సీత‌క్క మాట్లాడుతూ మ‌హిళా సంఘాల ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు సంఘాల ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. 98 శాతం రుణ చెల్లింపుతో సంఘాలు త‌మ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను చాటుతున్నాయ‌ని కొనియాడారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల పంపిణీపైనా కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. వాటిని తిప్పికొట్టాల‌ని సూచించారు. ఆకాశ‌మే హ‌ద్దుగా మ‌హిళ‌లు ఎద‌గాల‌నే ఉద్దేశంతో ఆకాశం రంగును చీర‌ల‌కు ఎంచుకున్నామ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్‌ కార్య‌ద‌ర్శి శేషాద్రి, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్, సెర్ప్ సీఈవో దివ్య దేవ‌రాజ‌న్‌, చేనేత‌, జౌళి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మీ పెట్రోల్ బంక్ ఎలా న‌డుస్తోంది
మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా న‌డుస్తోంద‌ని నారాయ‌ణ‌పేట జిల్లా మ‌హిళా స‌మాఖ్య అధ్య‌క్షురాలు అధ్య‌క్షురాలు అరుంధ‌తిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అడిగారు. బాగా న‌డుస్తోంద‌ని.. నెల‌కు రూ.4 ల‌క్ష‌ల రాబ‌డి వ‌స్తోంద‌ని ఆమె సీఎంకు తెలియ‌జేశారు. ఇత‌ర జిల్లాల నుంచి సంఘాల‌ను అక్క‌డ‌కు తీసుకెళ్లి వారి ప‌ని తీరు.. రాబ‌డిని ప్ర‌త్య‌క్షంగా చూపాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచించారు.
డిజైన్లు ఎంతో బాగున్నాయి
త‌మ‌కు ఇస్తున్న చీర‌ల డిజైన్లు ఎంతో బాగున్నాయ‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు భాగ్య ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 9 మీట‌ర్లు, 6 మీట‌ర్ల చీర‌లు త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఉన్నాయ‌ని…. త‌మ‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని ఆమె సీఎంకు తెలియ‌జేశారు.
మాకు యూనిఫాం ఇచ్చిన‌ట్లు ఉంది
ఇందిరామ‌హిళా శ‌క్తి చీర‌లు ఇవ్వ‌డం ద్వారా త‌మ‌కు యూనిఫాం వ‌చ్చింద‌నే సంతోషం ఉంద‌ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు శ్రీ‌దేవి తెలిపారు. ఈ చీర‌లు ధ‌రించ‌డం ద్వారా త‌మ సంఘాల మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంద‌ని ఆమె అన్నారు.