రసాయనాలా

  • నాలాలోకి రసాయన వ్యర్థాలు
  • ఘాటు వాసనలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
  • పట్టించుకోని పీసీబీ అధికారులు

పీసీబీ అధికారుల నిర్లక్ష్యం పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. రసాయనాలు పరిశ్రమల నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా నాలాలోకి వ్యర్థ రసాయనాలు వదులుతున్నారు. దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రసాయనాల వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు దృష్టి సారించి నాలాలోకి వ్యర్థాలు వదిలే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రసాయనాల ఘాటుకు బాలానగర్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఏర్పడుతుంది. నాలాల్లో రసాయనాలు కలవకుండా నియంత్రించాల్సిన పీసీబీ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు పరిశ్రమల యజమానులు నేరుగా డ్రైనేజీ ద్వారా నాలాల్లోకి రసాయన వ్యర్థాలను వదులుతున్నారు. ఘాటు వాసనలకు దగ్గు, కళ్లు మంటలు, శరీరంపై దద్దురులు, శ్వాస సంబంధ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా రోజుల నుంచి ఈ వాసనలు వస్తున్నప్పటికి రోజు రాత్రి పూట వాసనలు ఎక్కువగా వస్తున్నాయి. బాలానగర్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ, కల్యాణినగర్, వినాయక్ నగర్, గీతా నగర్, సాయి నగర్, నవజీవన్ నగర్ కాలనీ, ఫతేనగర్ డివిజన్ లోని గౌతం నగర్, దీనదయాల్ నగర్ లలో ప్రవహించే నాలా రంగు మారి ఘాటు వాసనలు వస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు కాలనీ వాసులు ఎన్ని వినతిపత్రాలు అందజేసినా చర్యలు తీసుకోవటం లేదని కాలనీ వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పీసీబీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు.

ఘాటు వాసన భరించలేకపోతున్నం
కెమికల్స్ ను నాలాలో విడుస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి వాసనలు ఎక్కువవుతున్నాయి. నాలాలో ఎక్కువగా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు రసాయనాలలో నాలా రంగు మారుతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. – ప్రేమకుమార్, కల్యాణినగర్
అధికారులు చర్యలు తీసుకోవాలి
పరిశ్రమల వ్యర్థాలు నాలాలో కలవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇంట్లోని ఇత్తడి, రాగి, వెండి సామాన్లు రంగు మారుతున్నాయి. ఘాటు వాసనలతో కొందరికి ఎలర్జీలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – నాగరాజ్ గౌడ్ నవజీవన్ నగర్