హైదరాబాద్ నగరంలో పుణె తరహా ‘ఇంటరాక్షన్‌’ పార్కులు

హైదరాబాద్ నగరంలో పుణె తరహా ఇంటరాక్షన్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు. ఇందుకు పార్కులకు నెలవైన విజయనగర్‌ కాలనీ డివిజన్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఒక పార్కును ఎంపిక చేయనున్నారు. పార్కులు కేవలం పచ్చదనాన్ని పంచడమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు నిత్యం స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేలా నగర పార్కులను రూపొందించేందుకు అర్బన్‌ బయోడైవర్సిటీ అధికారులు పూణే హార్టి‘కల్చర్‌’ను అందుబాటులోకి తేనున్నారు. నగర పార్కులకు భిన్నంగా ఈ పార్కుల్లో లాన్‌లకు కేవలం 20 శాతం మాత్రమే చోటుదక్కనుంది. ఇంటరాక్షన్‌ పార్కులుగా ప్రసిద్ధ్ది పొందిన ఈ పార్కుల్లో 20 శాతం చిల్డ్రన్స్‌ప్లే గ్రౌండ్‌, 20 శాతం ఓపెన్‌ స్పేస్‌ జిమ్‌లు ఏర్పాటుకానుండగా 40 శాతం స్థలంలో ఇంటరాక్షన్‌ లాన్లు సిద్ధ్దం కానున్నాయి. పార్కు చుట్టూ వాకర్స్‌కు పాత్‌వేలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా రూపుదిద్దుకోనున్న నూతన పార్కులో ఏపుగా పెరిగిన చెట్లకింద విరివిగా కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రకృతి ప్రేమికులతో పాటు ప్రకృతిని ఆస్వాదించే వారు ఈ పార్కుల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. ప్రధానంగా కాలనీవాసులు ప్రకృతిని ఆస్వాదిస్తూ, విస్తృతమైన చర్చా వేదికలు నిర్వహించుకునేందుకు ఇంటరాక్షన్‌ పార్కులు ఉపయోగపడతాయి. ఇంటరాక్షన్‌ పార్కులు కవులకు, రచయితలకు, సాహితీవేత్తలకు మరింత ఉపకరించనున్నాయి.
పార్కులకు శ్రీకారం..
సమాజ పురోభివృద్ధ్దికి చర్చలు ఒక వేదికగా నిలుస్థాయి. కుటుం బం నుంచి ప్రారంభమై ఏ రంగానికైనా ఒక దిశ, దశ చేకూరాలంటే ఇరువురి మధ్య సానుకూల చర్చలు అవసరం. ఇందుకు ఇరుపక్షాలు కూర్చుని చర్చించుకునే ఒక వేదిక ఎంతైనా ముఖ్యం. ఇందుకుగానూ జీహెచ్‌ఎంసీ ఎక్కువ మంది ఒకే చోట కూర్చుని చర్చించుకునే ఇంటరాక్షన్‌ పార్కులకు శ్రీకారం చుట్టనున్నది. ఈ మేరకు అర్బన్‌ బయోడైవర్సిటీ అధికారులు ఒక్కో జోన్‌లో ఒక ఇంటరాక్షన్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.