తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి, అన్ని చిత్ర దర్శకులకు, అతిథులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ ఫెస్టివల్లో ఉండటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సినిమా గురించి నేను ఎప్పుడూ ఒకే విషయం అనుకుంటాను. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు. ఏ భాష మాట్లాడుతున్నాడు అనేది సినిమాకు పెద్ద విషయం కాదు. కథ నచ్చాలి, భావం కలిసిరావాలి అంతే. ఈరోజు ఇక్కడ అదే బాగా కనిపిస్తోంది… నార్త్ ఈస్ట్ వాళ్లు, తెలంగాణ వాళ్లు పక్కపక్కన కూర్చుంటే చూడటానికి చాల ఆహ్లాదభరితంగా ఉన్నది. భూభాగం వేరైనా, మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. సినిమా యొక్క మేజిక్ ఏంటంటే.. మనుషుల కంటే కథలు వేగంగా ప్రయాణిస్తాయి, కథల కంటే భావాలు ఇంకా వేగంగా చేరతాయి. . నార్త్ ఈస్ట్ కొండల్లో తీసిన సినిమా… నల్లగొండలో కూర్చుని చూసే వ్యక్తిని కూడా అదే రీతిగా తాకుతుంది. ఇదే సినిమాకు ఉన్న బలం. మరొక విషయం – హైదరాబాద్ కి వచ్చే వాళ్లు అందరూ ఒక మాట చెబుతారు: “సార్, ఈ నగరం సొంతఇంటిలానే ఉన్నది”. నిజమే… హైదరాబాద్‌లో ఉన్న ఆత్మీయత అలాంటిదే. ఉదయం మీరు ఇక్కడికి కొత్తవారై వచ్చినా… సాయంత్రానికి స్నేహితులు దొరుకుతారు, తినడానికి బెస్ట్ బిర్యాని కూడా దొరుకుతుంది. మా హైదరాబాదీలు అలాంటివారు – వచ్చారంటే వాళ్లను ఇంటి వాళ్లలా చూసుకుంటారు
ఇదే ఆత్మీయత సినిమాలను కూడా ఇక్కడ పెంచింది. రామోజీ ఫిల్మ్ సిటీని మీరు చూస్తే అర్థమౌతుంది- ప్రపంచంలోనే పెద్ద స్టూడియో. ఎన్నో కలలు అక్కడ నిజమయ్యాయి. అక్కడ పనిచేసే టెక్నిషియన్ల శ్రమ వల్లే మనం పెద్ద తెర మీద చూసే మాయ జరుగుతోంది. ప్రభుత్వం గా మా లక్ష్యం ఏమిటంటే ఈ సినీ వాతావరణాన్ని మరింత సులభంగా, సహాయకరంగా మార్చడం. పెద్ద మాటలు.. చిన్న చిన్న సౌకర్యాలు – షూటింగ్ కి వెళ్లే రోడ్లు బాగుండాలి, అనుమతులు త్వరగా రావాలి, ప్రక్రియలు సులభంగా ఉండాలి. “తెలంగాణలో షూట్ చేద్దాం… ఇక్కడే బావుంటుంది” అనిపించడం మా అసలు టార్గెట్. సినిమా అలా స్టూడియోలో మాత్రమే కాదు, హైవేల్లో, అటవీ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఎక్కడైనా పుడుతుంది. అందుకే మేము రోడ్లు, కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నాం అంటే… అది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, కొత్త సినిమా లొకేషన్లకు దారులు. . నార్త్ ఈస్ట్ సినిమాల విషయం వస్తే… అవి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తాయి. ప్రకృతి, కథ, కలలు – ఇవన్నీ కలిసిపోతాయి. చూసిన వాళ్లకు హృదయానికి తగిలే విలువ ఉంటుంది. . ఇక్కడికి వచ్చిన నార్త్ ఈస్ట్ దర్శకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ కథలను మా నగరంతో పంచుకోవడం – ఇది మా కోసం గౌరవం. ఇక్కడ ఉన్న యువ దర్శకులకు ఒక మాట చెప్పాలి – ఇలాంటి ఫెస్టివల్స్ నే మీకు పెద్ద అవకాశాలు ఇస్తాయి. ఇక్కడే కలిసిన స్నేహం రేపు ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. మీ కలలు పెద్దవిగా పెట్టుకోండి. హైదరాబాద్ పెద్ద కలలకు పెరిగే స్థలం. తెలంగాణ ఆ కలలకు మద్దతు ఇచ్చే రాష్ట్రం. మీరు రండి, పని చేయండి – మేము ఉన్నాం. . ఈ రోజు మనం సినిమాను మాత్రమే కాకుండా, రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఆప్యాయతను కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. దూరంగా ఉన్నా… మనసులు మాత్రం ఎంత దగ్గరగా ఉన్నాయో ఈ ఫెస్టివల్ చూపిస్తోంది. ఈ రెండు రోజులు మీ అందరికీ అద్భుతమైన అనుభవాలను తీసుకురావాలి. సినిమాలు ఆస్వాదించండి, హైదరాబాద్‌ను ఆస్వాదించండి, ఈ బంధం ఇలా ప్రతి సంవత్సరం మరింత బలపడాలి. ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి ధన్యవాదాలు…ప్రోగ్రాం విజయవంతం చేస్తున్న మా FDC చైర్మన్ దిల్ రాజు,MD ప్రియాంక,సిబ్బందికి అభినందనలు..