ప్రతి జిల్లాకు ఒక ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్‌

జిల్లాల్లోని ప్రాసిక్యూషన్‌ విభాగానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 33 జిల్లాల్లోని జ్యుడిషియరీకి అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌ సోమవారం జీవో జారీ చేశారు. దాని ప్రకారం ప్రతీ జిల్లా ప్రాసిక్యూషన్‌ డైరెక్టరేట్‌లో ఒక డిప్యూటీ ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించనుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయా పోస్టుల్లో ఇన్‌చార్జ్‌లను నియమించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ శీలం సాంబశివారెడ్డిని ఆదేశించింది. గతంలో జిల్లా ప్రాసిక్యూషన్‌ కార్యాలయాల్లోని అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గ్రేడ్‌-1, డిప్యూటీ ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్లకు పరిపాలనా అధికారాలను కల్పిస్తూ ఉన్న ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తాజా జీవోలో సర్కారు పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాసిక్యూషన్‌ విభాగంలో ముఖ గుర్తింపు హాజరు పద్ధతి (ఎఫ్‌ఆర్‌ఏఎమ్‌ఎ్‌స)ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.