భ‌విష్య‌త్‌పై విశ్వాసం క‌ల్పించేలా బ్రాండింగ్‌: సీఎం రేవంత్ రెడ్డి

  • అంత‌ర్జాతీయ కంపెనీల పెట్టుబ‌డుల‌ను ఆకర్షించేలా ఉండాలి…
  • తెలంగాణ గ‌తం.. వ‌ర్త‌మానం.. భ‌విష్య‌త్‌ల‌ను ప్ర‌తిబింబించాలి
  • చ‌రిత్ర‌, ప్ర‌కృతి.. ప‌ర్యావ‌ర‌ణం, క‌ళ‌లు, ప్ర‌ముఖుల‌ను ప్ర‌చారంలో వినియోగించాలి
  • తెలంగాణ బ్రాండింగ్‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో నిర్వ‌హించ‌నున్న స‌మ్మిట్‌కు సంబంధించి బ్రాండింగ్‌పై త‌న నివాసంలో మంగ‌ళ‌వారం రాత్రి సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. గ్లోబ‌ల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ సంస్థ‌లు రూపొందించిన ప్ర‌చార చిత్రాలు, వీడియోలను ముఖ్య‌మంత్రి వీక్షించి ప‌లు మార్పులు చేర్పులు సూచించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో విభాగాల వారీగా మ‌నం చేప‌ట్టే ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌తి అంశాన్ని ప్ర‌చారంలో ప్ర‌ముఖంగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించారు. పెట్టుబ‌డిదారుల‌కు మ‌నం క‌ల్పించే స‌దుపాయాల‌ను స‌మ‌గ్రంగా వివ‌రించాల‌న్నారు. హైద‌రాబాద్‌కు అనుకూలాంశాలైన ఇన్న‌ర్ రింగు రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు, రానున్న రీజిన‌ల్ రింగు రోడ్డు, బంద‌రు పోర్ట్ వ‌ర‌కు నిర్మించ‌నున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రైపోర్ట్ తో పాటు తెలంగాణ‌లోని క‌ళా, సాంస్కృతిక, భాష, వాతావ‌ర‌ణ అనుకూల‌త‌ను వివ‌రించాల‌ని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో ఎటువంటి మార్పులేని అంశాన్ని, పెట్టుబ‌డుల విష‌యంలో మద్ద‌తుగా నిలుస్తున్న విష‌యాన్ని బ‌లంగా నొక్కి చెప్పాల‌ని సీఎం సూచించారు.

తెలంగాణ బ్రాండింగ్‌కు సంబంధించి మ‌న రాష్ట్రానికే ప‌రిమిత‌మైన, వైవిధ్య‌మైన‌ రామ‌ప్ప ఆల‌యంలోని నంది, స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌, న‌ల్ల‌మ‌ల్ల పులులు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకే ప్ర‌త్యేక‌మైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజ‌కీయాల‌ను శాసించిన పి.వి.న‌ర‌సింహారావు వంటి ప్ర‌ముఖులు, క‌ళాకారులు, క్రీడాకారులు, అంత‌ర్జాతీయ కంపెనీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర‌ముఖులు ఇలా ప్ర‌తి ఒక్క‌దానికి బ్రాండింగ్‌లో చోటు క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్ వేదిక‌ల‌ను బ్రాండింగ్‌కు స‌మ‌ర్థంగా వినియోగించాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు వి.శేషాద్రి, శ్రీ‌నివాస‌రాజు, సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ఉన్న‌తాధికారులు జ‌యేశ్ రంజ‌న్‌, సంజ‌య్ కుమార్‌, సందీప్ కుమార్ సుల్తానియా, శ‌శాంక‌, ఇ.వి.న‌ర‌సింహారెడ్డి, ముష్రాఫ్ అలీ, స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.