- ప్రపంచ వేదికపై తెలంగాణ మహిళా శక్తి ప్రతిభను ప్రతిధ్వనింపజేసిన మంత్రి సీతక్క
- గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆకట్టుకున్న సీతక్క ప్రసంగం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2025లో భాగంగా హాల్–4లో నిర్వహించిన ‘వ్యాపార రంగంలో మహిళల నాయకత్వం – (Fostering Entrepreneurship in Women)పానల్ డిస్కషన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి PR&RD ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, SERP CEO దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, హౌసింగ్ శాఖ ఎండి గౌతం, వికలాంగుల సాధికార శాఖ డైరెక్టర్ శైలజ హాజరయ్యారు. కార్యక్రమాన్ని WE-Hub CEO సీతా పల్లచోళ మోడరేట్ చేయగా, ప్యానెలిస్టులుగా జాతీయ గ్రామీణ అభివృద్ధి మాజీ అడిషనల్ కార్యదర్శి చరణ్జిత్ సింగ్, Shopify India Head భారతి బాలకృష్ణన్, Pradan Integrator మధు కేతన్, Resilience AI CEO ఆర్. సంహిత లు ప్యానలిస్టులుగా పాల్గొని మహిళా సాధికారత లో తెలంగాణ మోడల్ గా నిలుస్తుందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుందని, మహిళలు సంపత్తిని సృష్టించగలిగితే అభివృద్ధి నిజమైన అర్ధాన్ని సంతరించుకుంటుందని చెప్పారు. మహిళలు వ్యాపారాలు నడపడం ఆర్థిక వ్యవస్థకు అత్యంత స్థిరత్వాన్ని ఇస్తుందని, ఈ మార్పుకు తెలంగాణే నాయకత్వం వహిస్తుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ మహిళల ప్రతిభ, ఆవిష్కరణలు, సామాజిక–ఆర్థిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రతిధ్వనింపజేయడం ఈ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యమని వెల్లడించారు.
తెలంగాణ దేశంలోనే అతి పెద్ద, అత్యంత ప్రభావవంతమైన మహిళా నెట్‌వర్క్‌ను నిర్మించిన రాష్ట్రమని, 65 లక్షల స్వయం సహాయక సంఘాలు గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలో నడిపిస్తున్నాయని ఆమె వివరించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ పేద మహిళల నుంచి వికలాంగులు, వృద్ధ మహిళలు, అట్టడుగు వర్గాలు, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ వరకు అందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఒక మహిళ కూడా వెనుకబడిపోకూడదని తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని సీతక్క చెప్పారు.
గత రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు కేవలం సంక్షేమం వరకే పరిమితం కాలేదని, అవి మహిళల నిజమైన సాధికారత వైపు తీసుకెళ్లే సంస్కరణలని చెప్పారు. వడ్డీలేని రుణాలు, స్ట్రీ నిధి ద్వారా భారీ స్థాయిలో అందించిన క్రెడిట్ సపోర్ట్, లక్షలాది సూక్ష్మ మధ్యతరగతి వ్యాపారాల ఏర్పాటుతో మహిళల ఆర్ధిక స్వరూపం అమూల్యంగా మారిందని తెలిపారు. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి భవనాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచిన కేంద్రాలుగా మారాయని అన్నారు. ప్రమాద బీమా, లోన్ బీమా వంటి రక్షణ వలయాలు సమాన అవకాశాలను బలపరుస్తున్నాయని వివరించారు.
ప్రభుత్వం ప్రోత్సాహంతో మహిళలు కొత్త రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్నారని సీతక్క చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, హాస్పిటళ్లు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో నడుస్తున్న మహిళా శక్తి కాంటీన్లు స్థిరమైన ఆదాయ వనరులుగా మారగా, పాఠశాల యూనిఫార్ముల తయారీ, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల అమలు, RTCకి అద్దె బస్సుల కొనుగోలు, మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళలకు కొత్త వ్యాపార అవకాశాలను తెరిచాయని పేర్కొన్నారు. తెలంగాణలో 32 జిల్లాల్లో మహిళల చేత ఏర్పాటు కాబోతున్న 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు దేశంలోనే తొలి ఉదాహరణగా నిలిచాయని ఆమె గర్వంగా తెలిపారు.
మహిళా సంఘాల కోసం విదేశీ సంస్థలు, జాతీయ స్థాయి కార్పొరేషన్లతో భాగస్వామ్యాలు ఏర్పరచడం ద్వారా పెద్ద ఎత్తున కొత్త అవకాశాలను సృష్టిస్తున్నామని సీతక్క చెప్పారు. మహాలక్ష్మి ఉచిత బస్ పయన పథకం మహిళల జీవితాల్లో సంచలన మార్పును తీసుకువచ్చిందని, రోజూ 30 లక్షల మహిళలు ఉపయోగించుకుంటూ ఇప్పటిదాకా రూ. 7,600 కోట్లు ఆదా చేశారని చెప్పారు. గ్యాస్ సిలిండర్‌ను రూ. 500కే అందించడం ద్వారా 45 లక్షల కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించినట్లు వివరించారు.
గ్రామీణ మరియు పట్టణ మహిళా అభివృద్ధిని ఒకే శ్రేణిలోకి తీసుకొచ్చేందుకు SERP, MEPMA విలీనం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె చెప్పారు. భవిష్యత్తులో కోటి మంది మహిళలను శక్తివంతం చేయడం, లక్ష కోట్లు విలువైన మహిళా ఆర్థిక వ్యవస్థ నిర్మించడం, పెద్ద స్థాయిలో సంస్థాగత రుణాలు అందించడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్ధేశించిందని తెలిపారు. వికలాంగులు, వృద్ధలు, ఒంటరి మహిళలు, పలు వర్గాల ప్రజల కోసం కోసం సామాజిక భద్రతా కార్యక్రమాల రూపంలో పెన్షన్ల మొత్తాన్ని ఇప్పటికే రూ. 23,000 కోట్లు అందించడాన్ని ఆమె ప్రస్తావించారు.
2047 విజన్ గురించి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు GDPలో 40%వరకు దోహదం చేస్తున్నా, భారత్ ఇంకా 20% కూడా దాటలేదని, ఈ అసమానతను తెలంగాణ చెరిపేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 52% మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 2047 నాటికి 90%కు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో డే కేర్ సెంటర్లు, మహిళలకు భద్రతా రవాణా, తక్కువ వడ్డీ రుణాలు, మహిళా సహకార సమాఖ్యలు, ఆన్‌లైన్ మార్కెట్లు, ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఇవన్నీ మహిళల కేంద్రంగా ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలని అన్నారు.
తెలంగాణలో మహిళలు అవకాశాల కోసం ఎదురు చూడడం లేదని, అవకాశాలను స్వయంగా సృష్టించే శక్తి మహిళల్లో పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలను ఆవిష్కరించారు. మహిళా శక్తి తోడుగా 2047 నాటికి తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని తెలిపారు.
పెట్టుబడిదారులు, జాతీయ మరియు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో మహిళా ఆధారిత అభివృద్ధి అవకాశాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు.