- పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యం
- ఏఐ, డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతుల ఉత్పత్తులు పెంచేందుకు ఉపయోగపడాలి
పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యసాధన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఏర్పాటుచేసిన క్యాపిటల్ & ప్రోడక్టివిటీ ఫర్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చర్చా గోష్టిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే 22 ఏళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం లెక్కిస్తే 16 రెట్లు ఆర్థిక వృద్ధిని సాధించాల్సి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ను ఆవిష్కరించాము. ఇది కేవలం ఒక పత్రం కాదు… ఇది మన భవిష్యత్తుకి ఇచ్చిన ప్రతిజ్ఞ అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడం అనే మహత్తర లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. కానీ పేజీలపై లక్ష్యాలు రాయడం సులభం. అసలైన ప్రశ్న? నన్ను ఆలోచనలో పడేసే ప్రశ్న? ‘ఎలా?’ అనేదే అని వివరించారు. మనం ఎక్కువగా పనిచేస్తేనే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోలేం, మరిన్ని రోడ్లు, పెద్ద సంఖ్యలో భవనాలు నిర్మించడం మాత్రమే సరిపోదు, అవి చేస్తాం, కాని అవి మాత్రమే కాదు. ఈ విప్లవాత్మక వృద్ధిని సాధించాలంటే, మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక సమీకరణాన్ని మార్చాల్సిందే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆ సమీకరణ చాలా సులభం: మూలధనం + ఆవిష్కరణ = ఉత్పాదకత అని ఆవిష్కరణల ప్రాధాన్యతను జోడించారు. ఉత్పాదకతే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఎన్నేళ్లుగా భారతదేశంలోని ప్రభుత్వాలు తమను ‘రెగ్యులేటర్లు’గా మాత్రమే భావించాయి. అనుమతులు, లైసెన్సులు, ఫైళ్లకే ప్రాముఖ్యత ఇచ్చాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ర్యాంకులు పెరిగితే సంతోషపడ్డాం అని తెలిపారు. కానీ ప్రపంచం చాలా వేగంగా మారింది, డీప్‌టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది కేవలం కనీస అర్హత, అది ఒక బేస్‌లైన్ మాత్రమే అని అన్నారు. ఆసియాలో ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఫైళ్లు క్లియర్ చేయడమే కాదు… ఎకోసిస్టమ్‌లను క్రియేట్ చేసే ప్రభుత్వం కావాలి అని తెలిపారు. మన విజన్ డాక్యుమెంట్ CURE (అర్బన్), PURE (పెరి-అర్బన్), RARE (రూరల్) అనే స్పేషియల్ స్ట్రాటజీని ప్రతిపాదించింది అని వివరించారు. మన దగ్గర ప్రణాళిక ఉంది. ప్రతిభ ఉంది. కానీ ఇన్నోవేషన్ ఖరీదైనది. ముఖ్యంగా ఇన్నోవేషన్ అంటే రిస్క్ ఉంటుంది అని తెలిపారు. బ్యాంకులు సేఫ్టీని ఇష్టపడతాయి. కానీ ఇన్నోవేషన్‌కు ఫెయిల్యూర్ అవసరం అని వివరించారు. ఇంటర్నెట్ నుండి స్పేస్ ట్రావెల్ వరకు అత్యంత పెద్ద బ్రేక్‌థ్రూలు దశాబ్దాల పాటు లాభం లేకపోయినా, ఎవరైనా ఒక రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యాయి అని ప్రపంచ చరిత్ర చెబుతుంది అని డిప్యూటీ సీఎం తెలిపారు.
అందుకే ఈరోజు మా ప్యానెల్ ఎదుట ఉన్న అసలు ప్రశ్న: ఆ క్యాపిటల్‌ను ఎలా అన్‌లాక్ చేయాలి?
మేము ఒక రాష్ట్రంగా మారడానికి సిద్ధంగా ఉన్నాం. రెగ్యులేటర్‌గా కాకుండా, రిస్క్‌ను పంచుకునే ‘క్యాటలిస్ట్’గా మారడానికి సిద్ధంగా ఉన్నాం అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజల కోసం రివార్డులు పొందే భాగస్వామిగా మారడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.
ఈరోజు నేను మాట్లాడటానికి మాత్రమే రాలేదు… వినడానికి వచ్చాను, ఇక్కడ పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, ఎంట్రప్రెన్యూర్లు ఉన్న అద్భుతమైన ప్యానెల్ ఉంది. కాబట్టి నేరుగా అసలు విషయానికి వస్తాను అన్నారు.
మూడు ముఖ్యమైన ప్రశ్నలు:
- “ఉత్పాదకత vs ఉద్యోగాలు” అనే పరస్పర విరుద్ధ భావన
ఉత్పాదకత పెరుగుదల అంటే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయని భయం ఉంది. దీన్ని ఎలా ఎదుర్కొంటాం? - ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడంలో ప్రభుత్వ అసలు పాత్ర ఏమిటి?
మేము ‘స్లో-మూవింగ్’ వ్యవస్థగా విమర్శలు ఎదుర్కొంటున్నాం అన్నారు. అసలు ప్రభుత్వం దూరంగా ఉండాలా? లేక ఇన్నోవేషన్‌లో భాగస్వామి కావాలా? - AI, Deep Tech అంటే మనం ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఊహిస్తాం.
కానీ మన విజన్‌లో RARE (రూరల్) జోన్‌కు ముఖ్య స్థానం ఉంది అన్నారు.
డీప్‌టెక్ సైబరాబాద్‌లోనే కాకుండా, వరంగల్, నిజామాబాద్ రైతుల ఉత్పాదకత పెంచే ‘బోరింగ్ ప్రాబ్లమ్స్’ను కూడా ఎలా పరిష్కరించేలా చేసుకోవాలి? ఈ రంగాల్లో క్యాపిటల్‌ను ఎలా ఆకర్షించాలి? అన్న అంశాలపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.
చర్చా గోష్టి లో సెంటర్ ఫర్ ఎనలైటికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న తంత్రి, యువ పారిశ్రామికవేత్త పరశురాం, ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.