- 2047 నాటికి జీఎస్డీపీలో 10% వాటా…
- యువతకు భారీగా ఉపాధి కల్పించడమే లక్ష్యం
- అత్యాధునిక మౌలిక వసతులు, భవిష్యత్ వ్యూహాలు
- వారసత్వ సంపదపై అవగాహన పెరగాలి
- గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ పర్యాటక దృష్టికోణాన్ని వెల్లడించిన మంత్రి జూపల్లి
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో పర్యాటక రంగం వాటాను 10%కి పెంచాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా “తెలంగాణ అనుభవాలు – వారసత్వం, సంస్కృతి – ఫ్యూచర్ రెడీ టూరిజం” అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలకోపన్యాసం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో జరిగిన ఈ సమ్మిట్‌ను ప్రశంసిస్తూ, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని కేవలం సంఖ్యాత్మక సూచికగానే కాకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి మార్గంగా మంత్రి జూపల్లి అభివర్ణించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బలమైన ఆర్థికాభివృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వనరులు తక్కువగా ఉన్న అనేక దేశాలు పర్యాటకాన్ని ప్రధాన ఇంజిన్‌గా చేసుకొని అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించాయి. తెలంగాణలోనూ ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉంది,” అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.హాస్పిటాలిటీ, హస్తకళలు, రవాణా రంగాల్లోని వేలాది ఎంఎస్‌ఎంఈలకు ఇది జీవనాధారమని చెప్పారు.
తెలంగాణ పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి, ప్రాచూర్యం, ప్రచారం కల్పించాడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త పర్యాటక విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి విస్తృత స్థాయి ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో పర్యాటక రంగం వాటాను 10%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు.
శాతవాహనుల కాలం నుండి కాకతీయుల శిల్పకళ, కుతుబ్ షాహీ సమాధులు, చారిత్రక కట్టడాల వరకు రాష్ట్ర నిర్మాణ కళా వారసత్వాన్ని మంత్రి కొనియాడారు. కాకతీయ కళా తోరణం వంటి అద్భుతమైన నిర్మాణ సంపదను పర్యాటకులు తప్పక సందర్శించాలన్నారు.రాష్ట్ర పండుగలు, ఉత్సవాలు, హస్తకళలైన చేనేత, స్థానిక కళాకారుల పనితనం చిన్న వ్యాపారాలకు, సాంప్రదాయ జీవనోపాధికి మూలస్తంభాలని నొక్కి చెప్పారు. పోతన కవితల్లో ప్రతిబింబించే తెలంగాణ ప్రజల దయ, నిజాయితీ వంటి ఉన్నత విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు.
ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒక సాంస్కృతిక, సామాజిక విప్లవంగా మంత్రి అభివర్ణించారు. ఈ పథకం ద్వారా మహిళలు సులభంగా ప్రాంతీయ పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, తద్వారా సాంస్కృతిక అవగాహన, సామాజిక సుసంపన్నత లభిస్తాయని ఆయన అన్నారు.
పర్యాటకుల కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు, భద్రత, వసతి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. లగ్జరీ నుండి బడ్జెట్ వసతి వరకు ఏర్పాట్లు, సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలమైన రోడ్డు పక్కన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. నూతన పర్యాటక వెబ్‌సైట్ ద్వారా రవాణా, వసతి, భద్రత, ఆకర్షణల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు… పెట్టుబడిదారులు… పరిశ్రమ నిపుణులు… అందరూ కలిసి తెలంగాణ పర్యాటక సంపదను జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేద్దాం. సాంస్కృతికంగా సమృద్ధిగా, ఆతిథ్యంతో, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణను నిలుపుదాం” అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, అడిషనల్ పీసీసీఎఫ్ సునీతా భగవత్, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణ, ఎక్స్పీరియం చైర్మన్ రాందేవ్ రావు, ఆపరేషన్స్ (దక్షిణ & అంతర్జాతీయ), IHCL (ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాత్ వర్మ, రామోజీ ఫిల్మ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఏ.వి.రావు, తదితరులు పాల్గొన్నారు