“బ్లూ – గ్రీన్ ఎకానమీ” క్యాపిటల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

  • భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం
  • “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” చర్చాగోష్ఠిలో మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను ‘బ్లూ – గ్రీన్ ఎకానమీ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా ఓ వైపు బ్లూ, గ్రీన్ ఎకానమీకి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే… మరోవైపు మూసీ పునరుజ్జీవనం, హైడ్రా, నెట్ జీరో సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి దార్శనికతతో కూడిన విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో భాగంగా రెండో రోజు(మంగళవారం) ‘మూసీ పునరుజ్జీవనం & బ్లూ – గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. కేవలం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తేనే సరిపోదని, ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, పర్యావరణాన్ని కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. అందుకోసం… ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి వస్తుందన్నారు. భావితరాల కోసమే కాలుష్యంతో కంపు కొడుతున్న మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. గోదావరి నీటిని మూసీకి తరలించి గొప్ప జీవనదిగా మార్చేలా బృహత్తర ప్రణాళికలు రూపొందించామన్నారు. చెరువులు, కుంటలను కబ్జా కోరల్లో నుంచి రక్షించి వాటికి పునరుజ్జీవనం కల్పించాలనే సంకల్పంతోనే ‘హైడ్రా’కు శ్రీకారం చుట్టామన్నారు. మొదట్లో ‘హైడ్రా’పై అనుమానాలు వ్యక్తం చేసిన వారే… ఇప్పుడు మమ్మల్ని అభినందిస్తున్నారన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. “కొత్వాల్ గూడ”లో 85 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎకో పార్కు అరుదైన 19 రకాలకు చెందిన 8 వేల పక్షులకు ఆవాసంగా మారిందన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ లో “బ్లూ – గ్రీన్ ఎకానమీ”కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.