గ్లోబల్ సమ్మిట్ ను సందర్శించిన 3 వేల మంది విద్యార్థులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను నేడు (బుధవారం) పెద్ద ఎత్తున విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఈనెల 8 ,9 తేదీలలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో తమ ప్రాడక్టులను ప్రయివేటు సంస్థలు ప్రదర్శించాయి. నేడు ప్రధానంగా నగరంతోపాటు వివిధ జిల్లాల నుండి ప్రత్యేకంగా వచ్చిన ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టు కున్నాయి. ప్రాధానంగా ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ చెదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు,డ్రోన్స్ , రోబో తదితర 27 కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ స్టాళ్లను విద్యార్థులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

కాగా, భారత్ ఫ్యూచర్ సిటీలో బుధవారం నుండి 13 వ తేదీ (శనివారం ) వరకు నిర్వహిస్తున్న ప్లీనరీ సెషన్లలో నేడు జరిగిన యూత్ ఎంటర్ప్రెన్యూషిప్ అనే అంశంపై జరిగిన రెండు సదస్సులలో దాదాపు మూడు వేల మంది పాల్గొన్నారు. వీరిలో గురుకుల పాఠశాలల నుండి 1000 మంది లార్డ్స్ కళాశాల నుండి 700 మంది, వివిధ డిగ్రీ కళాశాల నుండి 1200 మంది, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు 500 పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. నేడు ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో we -హబ్ సి.ఈ.ఓ విద్యార్థులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం సదస్సుకు ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి విద్యార్థులతో ముచ్చటించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మనో జాగృతి సంస్థ కౌమార దశలో మానసిక పరిపక్వత అనే అంశంపై వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కోసం దాదాపు 56 బస్సులను ఏర్పాటు చేశారు. ప్లీనరీ సెషన్ లో భాగంగా మహిళా సంక్షేమం, సంస్కృతీ (విమెన్ రైజింగ్ ) అనే అంశంపై రెండు సదస్సులు జరుగుతాయని వెల్లడించారు.