- కాలుష్య కోరల నుంచి మా గ్రామాన్ని కాపాడండి
- హెటిరో పరిశ్రమను మూసేయండి..
- యూనిట్ – 1 పరిశ్రమపై దోమడుగు ప్రజల పోరాటం
- మాకు జీవించే హక్కు కల్పించాలి
- కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి
- పీసీబీ అధికారులను సస్పెండ్ చేయాలి
- పీసీబీ రాష్ట్ర కార్యాలయం ఎదుట దోమడుగు గ్రామస్తుల మహాధర్నా
హెటిరో యూనిట్ -1 పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలని, కాలుష్య కోరల నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని దోమడుగు గ్రామ రైతులు పోరాటం ఉధృతం చేస్తున్నారు. దీని ద్వారా నల్లకుంట చెరువు కలుషితమైందని, వారు కొన్ని నెలలుగా నిరసనలు చేపడుతూనే ఉన్నారు. శుక్రవారం కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దోమడుగు గ్రామస్తులు, రైతులు హైదరాబాద్ లోని సనత్ నగర్ పీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కాలుష్యంతో నెలకొంటున్న సమస్యపై మండలస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో నమూనాలు సేకరించినా, పీసీబీ అధికారులు పరిశ్రమపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యమయంగా మారడంతో స్థానికులు, రైతులు, కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజాసంఘాల నాయకులు హైదరాబాద్ సనత్‌నగర్‌లోని కాలుష్యనియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైన కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన అధికారులను, ఇతర ప్రభుత్వ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలుష్య సమస్యపై నాలుగు నెలల నుంచి తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకూ అధికారులందరినీ కలిసి వివరించామన్నారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లామన్నారు.
అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామంలో ర్యాలీలు చేశామని, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా సైతం నిర్వహించినట్లు గ్రామస్తులు గుర్తుచేశారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో శుక్రవారం పీసీబీ రాష్ట్ర కార్యాలయం ఎదుటే భోజనాలు చేసి, నల్లకుంట చెరువు కలుషిత జలాలను గుమ్మరించి నిరసన తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పీసీబీ అధికారులు గేటువద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసంఘాల నాయకులతో కలిసి వివరంగా చర్చించారు. త్వరలో ఈ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొసాగిస్తామని గ్రామస్తులు, ప్రజాసంఘాలు తేల్చిచెప్పారు. దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యానికి కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కాలుష్య వ్యతిరేకపోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ యాక్షన్ కమిటీ, రైతులు పీసీబీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శుక్రవారం మహాధర్నా చేపట్టగా, ఇదే సమయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు గుమ్మడిదల తహసీల్దార్‌ను కలవడంపై కేవీపీసీ నాయకులు,ప్రజాసంఘాల నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలిసిన ఆందోళనకారులు హుటాహుటిన గుమ్మడిదల తహసీల్ కార్యాలయం వద్దకు చేరుకుని మహాధర్నా చేపట్టారు. కాలుష్యంపై తాము ఆందోళనలు చేస్తుంటే, కొంతమంది నాయకులు తహసీల్దార్‌తో మంతనాలు జరపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేవీపీసీ కన్వీనర్లు మెంగని మంగయ్య, మద్దిబాల్రెడ్డి,జయమ్మ, కమిటీ సభ్యులు జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్వేచ్చారెడ్డి, టీపీజీఏసీ నాయకులు అశోక్‌కుమార్, సైనిటిస్ట్ కన్నెగంటి రవి, బీసీ డెమోట్రిక్ జేఏసీ నాకులు జనార్దన్, మానవహక్కుల వేదిక నాయకులు పి.సం జీవ్, సంధ్య, ైక్లెమేట్ ఫ్రంట్ నాయకులు రఘునందన్, పర్యావరణ ప్రజాఉద్యమాల నాయకులు రాజశేఖర్, వినోద్‌కుమార్, లక్ష్మి, మానస, చంద్రారెడ్డి పాల్గొన్నారు.