విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : కాలానుగుణంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాలుగా విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, “విద్యార్థులకు నాణ్యమైన విద్య” అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ఉపాధ్యాయుల భర్తీ, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ ఎడ్యుకేషన్ వరకు విద్యారంగంలోని ప్రతి దశలో సమగ్ర మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహించిన ET TECH X (ఈటీ టెక్ ఎక్స్) – 6వ ఎడిషన్ కార్యక్రమానికి శనివారం నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో వేగంగా మారుతున్న విద్యా ప్రపంచంలో ET TECH X వంటి వేదికలు అత్యంత అవసరమని, టెక్నాలజీ–విద్య కలిసి భవిష్యత్తును ఎలా నిర్మించాలి అనే అంశంపై ఆలోచించేందుకు, చర్చించేందుకు ఇవి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ ఒకే క్యాంపస్‌లో అన్ని సౌకర్యాలతో కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు.

రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.21,000 కోట్ల పెట్టుబడి. ప్రతి పాఠశాలను 25 ఎకరాల విశాల ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఏర్పాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో,
2024 డీఎస్సీ ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 2024 సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అమలు చేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.140 కోట్ల వ్యయాన్ని భరిస్తోందని మంత్రి వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (AAPCs) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.642 కోట్ల వ్యయంతో 59 వేల మౌలిక సదుపాయాల పనులు పూర్తి. పాఠశాలల పరిశుభ్రత, తరగతి గదుల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను AAPCsకి అప్పగిస్తూ సుమారు రూ.146 కోట్ల నిధులు కేటాయింపు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరంనుంచే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించనుందని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి యువతకు తక్షణ ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. అదే విధంగా, యువత పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు నేర్చుకునేలా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు కూడా తెలంగాణ ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణను క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది చారిత్రాత్మక ముందడుగు అని పేర్కొన్నారు.అన్ని చర్యలతో విద్యార్థులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు బలపడతాయని, రాష్ట్రంలో వృత్తి ఆధారిత విద్యకు బలమైన పునాది పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.