- ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి
- ముఖ్యమంత్రి, ఆర్.అండ్.బి. మంత్రి ఆదేశాల మేరకు ఫీల్డ్ విజిట్ చేసిన స్పెషల్ సిఎస్
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు, రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం కలియతిరిగిన స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఇంజనీర్లను,వర్క్ ఏజెన్సీని పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులకు, నిర్మాణ సంస్థకు పలు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కృత నిశ్చయంతో ఉందని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ అన్నారు. అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ 12,14,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 1196 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి రెగ్యులర్ గా నిర్మాణ పురోగతిపై మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పూర్తి నాణ్యతతో స్ట్రక్చరల్ వర్క్ పూర్తయిందని,95% బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్ పూర్తయిందని,MEP 60%, ఫ్లోరింగ్, పెయింటింగ్ వర్క్స్ 50శాతం మేర పూర్తయి వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. మొత్తంగా టిమ్స్ అల్వాల్ పనులు 70% శాతం పూర్తయ్యాయని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్.అండ్.బి. శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విధించిన గడువులోగా..2026 మార్చి చివరి నాటికి అన్ని రకాల పనులు పూర్తయి,ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను, వర్క్ ఏజెన్సీని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఆదేశించారు. ఆరోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అన్నారు. రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ చేస్తానని అందరూ అలెర్ట్ గా పనిచేస్తూ..ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ విజిట్ లో ఆర్ అండ్ బి సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి,లింగారెడ్డి,పలువురు ఈ.ఈ, డి.ఈ లు ఫీల్డ్ ఇంజనీర్లు, DEC ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.