ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు.. కార్మికుడి మృతి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. బట్టీ పేలుడు ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బట్టీల వద్ద దాదాపు 50 మంది పని చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం మాత్రం ఇంతవరకు స్పందించ లేదు. ఈ పేలుడు ఘటనపై సమాచారం అందగానే.. మేడ్చల్, తుప్రాన్ ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది రంగయిపల్లికి హుటాహుటిన వచ్చి.. ఈ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఆ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకుపోయాయి. దాంతో ఆయా గ్రామస్తులు పొగతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.