రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లు మరియు భవనాల శాఖ (T, R&B) స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్లు రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి క్షేత్రస్థాయి ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు మరియు కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంబంధిత అధికారులకు మరియు సంస్థలకు కీలక ఆదేశాలను జారీ చేశారు. సుమారు రూ. 2583.00 కోట్లు వ్యయంతో 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం రాష్ట్ర ఐకానిక్ బిల్డింగ్ లా ఉండాలని,అధికారులు అందుకు తగ్గట్టుగా మనసుపెట్టి పనిచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
“పనుల్లో జాప్యం కలగకుండా ఉండటానికి, కన్సల్టెంట్లు డ్రాయింగ్ షెడ్యూల్‌ను ముందుగానే అందించాలి. దీనివల్ల కాంట్రాక్ట్ సంస్థ అవసరమైన సిబ్బందిని, యంత్రాలను మరియు సామగ్రిని సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.” పనుల పురోగతిపై శాఖా పరమైన అధికారులు కన్సల్టెంట్ మరియు కాంట్రాక్టర్‌తో తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జ్యుడీషియల్ అధికారుల సూచనల మేరకు సవరించిన ప్లాన్లను వెంటనే సిద్ధం చేసి అనుమతులు తీసుకోవాలని కన్సల్టెంట్లను ఆదేశించారు. అలాగే, జోన్ 2కి సంబంధించిన అటవీ శాఖ అనుమతులను (Forest clearances) త్వరితగతిన పూర్తి చేయాలని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ చీఫ్ ఇంజనీర్‌కు సూచించారు.