పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’: మంత్రి శ్రీధర్ బాబు

  • పర్ఫెక్షనే కాదు… సిన్సియారిటీ కూడా అవసరం
  • • ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అంతర్గత బలహీనతలే ప్రమాదకరం
  • • యువ సివిల్ సర్వెంట్లకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం

‘ఈ దేశం మీ నుంచి కేవలం పర్ఫెక్షన్ మాత్రమే ఆశించడం లేదు… అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది’ అని యువ సివిల్ సర్వెంట్లకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దిశా నిర్దేశం చేశారు. గురువారం జూబ్లీహిల్స్ లోని డా.ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్సిట్యూట్ ఆఫ్ తెలంగాణలో నిర్వహించిన ‘స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఏఐఎస్ & సీసీఎస్ ఆఫీసర్స్ – 2025’ ముగింపు వేడుకలకు ఆయన విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గవర్నెన్స్ అంటే కేవలం ఫైళ్లు, నిబంధనలు కాదని, అది ప్రజలతో మమేకమయ్యే ఒక హ్యూమన్ రిలేషన్ అని అన్నారు. అధికారం, హోదా, ప్రోటోకాల్స్ అన్నీ తాత్కాలికమని.. ప్రజల జీవితాల్లో మీరు తీసుకొచ్చే సానుకూల మార్పు మాత్రమే శాశ్వతమన్నారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని, నిరుపేదల ప్రయోజనాలనూ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అప్పుడే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయన్నారు. కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా నిత్యం ప్రజలతో మమేకం కావాలని ఉద్బోధించారు. ప్రజా సేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అహంకారం, ఉదాసీనత, అవినీతి లాంటి అంతర్గత బలహీనతలే ప్రమాదకరమని హెచ్చరించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ స్వీయ నియంత్రణ పాటిస్తూనే… నిజాయితీ, వినమ్రత, ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పౌర సేవలు ప్రజల ముంగిటకు చేరాలంటే టెక్నాలజీ వినియోగం అత్యవసరమన్నారు. అయితే… ఆ సాంకేతికత ప్రజలకు చేరువగా ఉండాలి కానీ, వారిని భయపెట్టేలా ఉండొద్దన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’ సాధ్యమవుతుందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని యువ అధికారులకు సూచించారు.