హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్

హైదరాబాద్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం సందర్శన కూడా ఉంది. మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఈసీకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) శ్రీ సి. సుదర్శన్ రెడ్డి సహా ఎన్నికల విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి బయలుదేరి, సాయంత్రం 6.30 గంటలకు భ్రమరాంభ అతిథి గృహానికి చేరుకోనున్నారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా జ్ఞానేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)తో రవీంద్రభారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించనున్నారు. శ్రీశైలం పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక, భక్తి పరమైనదిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అధికారిక సమావేశాలు లేవని అధికారులు తెలిపారు. ఈ పర్యటనను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు.