కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సిఎస్ కె. రామకృష్ణా రావు సమీక్ష

హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ వాతావరణానికి తగిన విధంగా హైదరాబాద్ నగరపు సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కైట్ ఫెస్టివల్ కు ప్రత్యేక గుర్తింపు, విస్తృత ప్రచారం కల్పించేలా సరైన పేరు, ప్రత్యేక బ్రాండింగ్, ఆకర్షణీయమైన లోగోను రూపొందించాలని సంబంధిత శాఖలను ఆయన ఆదేశించారు. హైడ్రా ద్వారా పునరుజ్జీవింపబడిన చెరువుల వద్ద ఈ కైట్ ఫెస్టివల్ ను నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షను సిఎస్ తెలిపారు. దీని ద్వారా నగరంలోని నీటి వనరుల పునరుద్ధరణలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడం లక్ష్యమని ఆయన అన్నారు. గుర్తించిన ప్రదేశాల్లో కైట్ ఫెస్టివల్ కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి సమన్వయం చేయడానికి జిహెచ్ఎంసి హెచ్ఎండిఎ , హైడ్రా తరఫున ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించాలని ఆయన ఆదేశించారు. జనవరి మొదటి వారం నుంచి గౌరవ మంత్రులు పునరుద్ధరించబడిన చెరువులను సందర్శించి ఏర్పాట్లను సమీక్షిస్తారని ఆయన తెలిపారు. సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ నగరవ్యాప్తంగా హైడ్రా ద్వారా పునరుజ్జీవింపబడిన చెరువులపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటి నిల్వ సామర్థ్యం పెంపు, పర్యావరణ స్థిరత్వం , ప్రజాప్రయోజనాల కోసం చేపట్టిన పునరుద్ధరణ పనులను వివరించారు. పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వి. క్రాంతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నామని, ఇందులో దేశీ–విదేశీ గాలిపటాల కళాకారులు పాల్గొంటారని చెప్పారు.
అదేవిధంగా నగర పరిసర ప్రాంతాల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించి సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా డ్రోన్ పైలట్లు పాల్గొనే డ్రోన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నట్లు, ఇది పండుగ వేడుకలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తుందని వివరించారు. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, సంక్రాంతి వేడుకలను ప్రజలకు మరపురాని అనుభవంగా మార్చాలని సిఎస్ ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, హెచ్ఎండిఎ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణ రెడ్డి, మను చౌదరి, టిజి ఎస్పిడిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్, సమాచారశాఖ అదనపు సంచాలకులు డిఎస్‌ జగన్‌ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.