- మహిళా బాధితుల నుండి దరఖాస్తుల స్వీకరణ
మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో “నారీ న్యాయ్: హియర్ హర్ ఔట్” అనే బహిరంగ విచారణ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా నుంచి ఉద్యోగ, గృహ హింస వేధింపులు, వివక్ష, ఆర్థిక, సైబర్ క్రైమ్ తదితర సమస్యలకు సంబంధించిన మహిళా బాధిత ఫిర్యాదులను స్వీకరించారు. ఉదయం 10:00 గం.ల నుండి మధ్యాహ్నం 2:30 గం.ల వరకు కొనసాగిన ఈ విచారణలో దాదాపు 100 మంది పైగా మహిళలు సమర్పించిన ఫిర్యాదులను చైర్ పర్సన్ నేరెళ్ల శారద, అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ఉమెన్ సెప్టీ డి.సి.పి. లు డా. లావణ్య, టి. ఉషా రాణి, అలాగే జిల్లా రెవిన్యూ అధికారి ఈ. వెంకటాచారి బాధితుల సమస్యలు విని తగు పరిష్కారాలు సూచిస్తూ సంబంధిత శాఖల నుండి చర్యలు, పెండింగ్ ఫిర్యాదులపై నివేదికలు కోరారు.
మహిళల ఆవేదనను విని వారికి న్యాయం చేకూరేలా, త్వరితగతిన అవసరమైన చర్యలు చేపట్టేలా చూడటానికే “నారీ న్యాయ్: హెయిర్ హర్ ఔట్” అనే బహిరంగ విచారణ ఏర్పాటు చేసి ఇందులో వివిధ విభాగాలను విచారణలో భాగస్వామ్యం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అధిక శాతం ఫిర్యాదులు గృహ హింస పై అందాయని ఎక్కువ ఫిర్యాదుల్లో నిందితులు ఎన్.ఆర్.ఐ లై ఉండటం వలన ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టి కి తీసుకువెళ్ళి తగు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అనేక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజా రమణ, సభ్యులు షాహిన్ అఫ్రోజ్, ఈశ్వరి బాయ్, శుద్ధం లక్ష్మి, గద్దల పద్మ, కొమ్ము ఉమాదేవి యాదవ్, ఏ రేవతి రావు, జిల్లా సంక్షేమ శాఖాధికారులు అక్కేశ్వర్ రావు, రాజేందర్, ప్రవీణ్ కుమార్, ఆర్. కోటాజీ, జి. ఆశన్న, ఇలియాజ్ అహ్మద్, వివిధ శాఖాధికారులు, వివిధ జోన్ ల పోలీస్ అధికారులు, సఖి నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.