తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం (ఖరీఫ్) 2025–26 సీజన్‌లో కురిసిన అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హస్తకళలు & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి మంత్రి తుమ్మల ప్రత్యేక లేఖలు రాసి, తెలంగాణ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల తన లేఖలో పేర్కొంటూ తెలంగాణలో సోయాబీన్ ఒక ప్రధాన ఖరీఫ్ పంటగా ఉన్నదని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గిరిజన రైతులు పెద్ద ఎత్తున ఈ పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. 2025–26 సీజన్‌లో సుమారు 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు జరగగా, దాదాపు 2.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. అయితే, కోత దశలో కురిసిన భారీ వర్షాల వల్ల సోయాబీన్ పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో పెద్ద మొత్తంలో పంట FAQ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకుండా మారిందని వివరించారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో ప్రధానంగా గిరిజన రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 36 వేల మెట్రిక్ టన్నుల వర్షనష్టం చెందిన సోయాబీన్‌ను ధర మద్దతు పథకం (PSS) కింద కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే FAQ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ, అమలుకావాల్సిన ధర విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా, గిట్టుబాటు ధర పొందగలుగుతారని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా, మొక్కజొన్న రైతుల పరిస్థితిపై కూడా మంత్రి తుమ్మల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఈ సంవత్సరం మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, మార్కెట్లకు భారీగా పంట రావడంతో ధరలు కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకు పడిపోయాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 2.96 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి, వేలాది రైతులకు అండగా నిలిచిందన్నారు. అయితే, ఈ కొనుగోళ్ల వల్ల రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే దాదాపు 750 కోట్ల ఆర్థిక భారం పడిందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ (NAFED) ద్వారా రాష్ట్రం కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎథనాల్ మరియు డిస్టిల్లరీ పరిశ్రమలకు సరఫరా చేసేలా తక్షణ ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. దీనివల్ల రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం కూడా తగ్గడంతో పాటు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పనలో రాష్ట్రప్రభుత్వానికి చేయూతనిచ్చినట్లు అవుతుందని అన్నారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే కొనుగోలు, నిల్వ, రవాణా, లాజిస్టిక్స్, మౌలిక వసతుల పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి లేఖలు రాసిన మంత్రి తుమ్మల, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం తీసుకునేవిధంగా చొరవ చూపాలని కోరారు.