కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

జోగులాంబ గద్వాల జిల్లా కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ హాల్ నందు జిల్లా అధికారులు మరియు వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై మాట్లాడారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్షేత్రమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వికసిత భారత్ జాతీయ స్లోగన్ గా పేర్కొంటూ ప్రజలందరూ దేశాభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. ’వికసిత్ భారత్’ దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాజ్ భవన్‌ను ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ‘లోక్ భవన్’గా పేరు మార్చినట్లు గవర్నర్ తెలిపారు. విద్య అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంటూ, విద్యా రంగంలో గుణాత్మక అభివృద్ధి సాధించి, జిల్లాలో ఉత్తమ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. టీబీ ముక్త భారత్ కార్యక్రమంను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో వాటిని ఇంకా మెరుగ్గా నిర్వహించి మరింత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ సూచించారు. జిల్లా పరిపాలన యంత్రాంగం పనితీరు ప్రశంసనీయంగా ఉందని, భవిష్యత్తులో ఎదురయ్యే కొత్త సవాళ్లకు నూతన పరిష్కారాలు కనుగొని ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక వివరాలు, చరిత్ర, ప్రసిద్ధ ఆలయాలు, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి, వివిధ శాఖల సంక్షేమ పథకాల అమలు గురించి గవర్నర్ కు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం గవర్నర్ కు గద్వాల చేనేత పట్టు చీర ఫ్రేమ్ ను జ్ఞాపికగా అందజేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జ్ఞాపికను బహుకరించారు. పలువురు ప్రజాప్రతినిధులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు గవర్నర్ కు వినతి పత్రాలు అందజేశారు.

అంతకుముందు అలంపూర్ నుంచి కలెక్టరేట్ కు చేరుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు జిల్లా అధికార యంత్రాంగం, పలువురు ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గద్వాల బాల భవన్ చిన్నారులు స్వాగతం పలుకుతూ చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఇక్కడి ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను గవర్నర్ సందర్శించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు. ఇతర కార్యక్రమాల వివరాలను తెలుసుకొని నిర్వాహకులను ప్రశంసించారు. మెప్మా. సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లు పరిశీలించి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి వ్యాపారాల్లో రాణించడం అభినందనీయమన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ లో టి.బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం గురించి నిర్వాహకులు గవర్నర్ కు తెలియజేశారు. నషా ముక్త భారత్, మహిళా, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన స్టాల్లు పరిశీలించారు. చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మగ్గం, రాట్నం పరిశీలించి చేనేత కార్మికుల పనితీరును ప్రశంసించారు. గద్వాల చీరల ప్రత్యేకత, ఇతర వివరాలను క్షుణ్ణంగా చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఆయా స్టాల్స్ నిర్వాహకులు గవర్నర్ కు గౌరవార్థం వివిధ హస్త కళా వస్తువులను బహుకరించారు. అనంతరం కలెక్టరేట్ గార్డెన్ లో గవర్నర్ మొక్కను నాటారు. చివరగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, గవర్నర్‌కు సంయుక్త కార్యదర్శి జె.భవానీ శంకర్, గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ శాసన సభ్యులు విజయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, గవర్నర్‌కు ఏడీసీ మేజర్ అమన్ కుందూ, ఏడీసీ కాంతిలాల్ పటేల్, సీఎస్‌ఓ ఎల్.శ్రీనివాస రావు, గవర్నర్‌ వ్యక్తిగత కార్యదర్శి పవన్ సింగ్, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, ఆర్డీవో అలివేలు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.