- ₹22,324 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు; సుమారు 90,000 ఉద్యోగాల సృష్టి
- పర్యాటకుల భద్రతే ధ్యేయంగా ‘టూరిస్ట్ పోలీస్’ అద్భుత సేవలు
- తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ద్వారా సమగ్ర అభివృద్ధి
- 2025 విజయాలను, 2026 లక్ష్యాలను వెల్లడించిన పర్యాటక శాఖ
హైదరాబాద్, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్ధేశంలో తెలంగాణ పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని పర్యాటక శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2025 సంవత్సరంలో పర్యాటక శాఖ సాధించిన ప్రగతిని, 2026 లో సాధించబోయే లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను ఆ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రధాన విజయాలు – 2025:
ఎకో (పర్యావరణ), మెడికల్ (వైద్య), హెరిటెజ్ (వారసత్వ), స్పిరిచ్వల్ (ఆధ్యాత్మిక), రూరల్ అండ్ ట్రైబల్ (గ్రామీణ, గిరిజన), సినిమా, వెడ్డింగ్ డెస్టినేషన్, స్పోర్ట్స్ టూరిజంపై దృష్టి సారించి “తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030” ని అమలులోకి తెచ్చామని, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను (STAs) అభివృద్ధిని వివరించారు.
టూరిజం కాంక్లేవ్ 2025 ద్వారా 30 ప్రాజెక్టులకు గానూ ₹15,279 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి, తద్వారా సుమారు 50,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరో ₹7,045 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాల సృష్టి జరగనుంది. ముఖ్యంగా ఫుడ్లింక్ గ్లోబల్ సెంటర్ (₹3,000 కోట్లు), సారస్ ఇన్ఫ్రా (₹1,000 కోట్లు), స్మార్ట్ మొబిలిటీ (₹1,000 కోట్లు) వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయిని చెప్పారు.
పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సరికొత్త పథాన దూసుకెళ్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 123 ప్రాజెక్టులలో ఇప్పటికే 78 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. దీనికి అదనంగా, కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశ్ దర్శన్ 2.0 మరియు ప్రసాద్ (PRASHAD) కింద రూ. 275 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనంతగిరి కొండల్లో ‘ఎకో-టూరిజం జోన్స , భువనగిరి కోట వద్ద ‘ఎక్స్‌పీరియెన్షియల్ జోన్’ను తీర్చిదిద్దుతున్నారు. అలాగే, జల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ హుస్సేన్ సాగర్‌లో 120 మంది ప్రయాణించగల “ముచుకుంద” అనే డబుల్ డెక్కర్ బోటును పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చింది.
ప్రపంచ సుందరీ వేడుకలు హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపడమే కాకుండా, 110 దేశాల నుండి వచ్చిన సుందరీమణులు “పర్యాటక రాయబారులుగా” మారి మన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఇది హైదరాబాద్‌ను కేవలం పెట్టుబడులకే కాకుండా, వ్యాపారానికి “సురక్షితమైన, అనుకూలమైన రాష్ట్రంగా” నిరూపించిందని ఉద్ఘాటించారు.
బతుకమ్మ పండుగను ప్రపంచ వేదికపై నిలబెడుతూ.. అతిపెద్ద బతుకమ్మ (19.44 మీటర్లు), 1,354 మంది మహిళలతో అతిపెద్ద జానపద నృత్యం ప్రదర్శించి సెప్టెంబర్ 29, 2025న రెండు గిన్నిస్ రికార్డులు సాధించామని సగర్వంగా ప్రకటించారు. పర్యాటకుల భద్రత కోసం 80 మంది ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులతో అక్టోబర్ 13, 2025న ప్రారంభించిన “టూరిస్ట్ పోలీస్” వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం యూనిఫైడ్ ఆన్లైన్ పోర్టల్, డిజిటల్ ట్రావెల్ కార్డులు వంటి వినూత్న సేవలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
2026 లక్ష్యాలు: ❇️రాబోయే 2026 సంవత్సరానికి గానూ పర్యాటక శాఖ స్పష్టమైన ప్రణాళిక వివరాలను ప్రకటించింది:
❇️హైదరాబాద్ – సోమశిల – శ్రీశైలం సర్క్యూట్లో హెలీ టూరిజం సేవలను పూర్తిస్థాయిలో హెలీ టూరిజం అందుబాటులోకి తేవడం.
❇️నాగార్జున సాగర్, సోమశిల, బస్వాపూర్ వంటి ప్రాంతాలను అత్యుత్తమ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా అభివృద్ధి చేయడం.
❇️నాగార్జున సాగర్, బస్వాపూర్, సోమశిలలో కొత్త వెడ్డింగ్ డెస్టినేషన్ల అభివృద్ధి
❇️మెడికల్ టూరిజం సొసైటీని స్థాపించి, హైదరాబాద్‌ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడం.
❇️జనవరి 13, 14, 15న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ షోలను నిర్వహించడం. 19 దేశాల నుండి 40 మంది అంతర్జాతీయ, 55 మంది జాతీయ కైట్ ప్లయర్స్ భాగస్వాములు కానున్నారు.
❇️హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026: జనవరి 16-18 వరకు ఐరోపా దేశాలకు నుంచి వచ్చే ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయి 15 బెలూన్లతో ప్రదర్శన.
❇️డ్రోన్ షో 2026: గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 13, 14న హైటెక్ డ్రోన్లతో వినూత్న ప్రదర్శన
❇️జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ పై ప్రత్యేక దృష్టి.
తెలంగాణ పర్యాటక రంగం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే వనరుగా మారుతోందిని ఆశాఖ అధికారులు స్పష్టం చేశారు.