యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమృద్ధిగా నిల్వలున్నప్పటికి రైతులలో అనవసర ఆందోళనలు సృష్టించే ప్రయత్నాలు
  • రబీకి అవసరమైన 10.40 లక్షల టన్నలు యూరియాలో ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా
  • గత సంవత్సరం డిసెంబర్ నెల అమ్మకాలతో పోల్చుకుంటే ఈ డిసెంబర్ లో లక్ష టన్నులు అదనంగా యూరియా కొనుగోలు చేసిన రైతులు
  • యాప్ అమలు చేస్తున్న జిల్లాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందుతున్నాయి
  • ఈ యాప్ పై కూడా దుష్ప్రచారం
  • సొసైటీకి గాని, రిటైల్ షాప్ కు వచ్చే ప్రతి ఒక్క రైతు కూడా అందుతున్న యూరియా బస్తాలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేపడుతోందని, అన్ని జిల్లాల్లో సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ రైతులలో అనవసర ఆందోళనలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రబీ సీజన్‌కు అవసరమైన మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటికే సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే, ఈ డిసెంబర్‌లో రైతులు లక్ష మెట్రిక్ టన్నుల మేరకు అదనంగా యూరియా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత ఏడాది రబీ సీజన్‌లో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 13.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇందులో ప్రధాన పంటలైన వరి 3.94 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తవగా, మొక్కజొన్న 5.45 లక్షల ఎకరాల్లో సాగైనట్లు తెలిపారు.

ప్రస్తుతం దుక్కిలో వేసుకునే డి.ఏ.పీ మరియు కాంప్లెక్స్ ఎరువులను రైతులు అధికంగా కొనుగోలు చేస్తున్నారని, మొక్కజొన్న సాగు చేస్తున్న జిల్లాలలో మరియు కొన్నిచోట్ల రైతులు ముందస్తు జాగ్రత్తగా యూరియా బస్తాలు కూడా కొనుగోలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. అయితే ముందుగానే అవసరమైన మేరకు ఎరువులను రాష్ట్రానికి తెప్పించి నిల్వ ఉంచినందున రైతులకు ఎక్కడా కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటికే రైతులకు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. సొసైటీకి గానీ, రిటైల్ షాప్‌కు గానీ వచ్చే ప్రతి రైతుకూ యూరియా బస్తాలు అందుతున్నాయని చెప్పారు. మండల అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, సహాయ సంచాలకులు అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూరియా సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. డీలర్ల వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలని, అందరూ ఒకే కేంద్రానికి వచ్చి ఇబ్బందులు పడకుండా మండలాల్లో ఉన్న అన్ని రిటైల్ కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. యాప్ అమలవుతున్న జిల్లాలలో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 5 జిల్లాల్లో దాదాపు లక్ష మంది రైతులు యాప్ ద్వారా 3.19 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.