త్వరలో 265 ఏఈఈ పోస్టుల భర్తీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రోడ్లు, భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 265 ఏఈఈ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే శాఖలో వివిధ హోదాల్లో పనిచేసే ఇంజినీర్లకు ప్రమోషన్లు కల్పించనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగులు రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.

క్షేత్రస్థాయిలో ఉండే ఏఈలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని, ఉద్యోగుల కోరిక మేరకు ఈ ఏడాది అన్ని హంగులతో కూడిన ఆడిటోరియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.11,399 కోట్ల ప్రతిపాదిత హ్యామ్‌ ప్రాజక్టును ఓ కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, దీనిపై త్వరలో సీఎంను కలిసి చర్చించనున్నట్టు తెలిపారు. ట్రిపుల్‌ ఆర్‌కు అనుసంధానంగా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీలు సహా టిమ్స్‌, నిమ్స్‌, ఉస్మానియా దవాఖానలు, హైకోర్టు, జిల్లా కోర్టులు, కలెక్టరేట్లలో నిర్మాణ పనులతోపాటు రూ.60 వేల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తామని వివరించారు. ఇందులో డబుల్‌ లేన్‌, ఫోర్‌ లేన్‌, 6 లేన్‌ రోడ్లు ఉన్నాయని పేర్కొన్నారు.