ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫార్మా పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి : శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

  • పరిశ్రమల వారితో పీసీబీ అధికారులు కుమ్మక్కు కాకూడదు..
  • గట్టి చర్యలు తీసుకుంటున్నాం: పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ

ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఫార్మా కంపెనీల కాలుష్యంతో మరో పటాన్ చెరులా మారకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలోని కిష్టాపురం గ్రామంలో పచ్చటి పొలాల మధ్యన కొత్త ఫార్మా కంపెనీలు నెలకొల్పుతున్నారని తెలిపారు. చౌటుప్పల్ మండలంలో ఇప్పటికే నెలకొల్పిన ఫార్మా పరిశ్రమల కాలుష్యంతో భూగర్భ జలాలు రంగు మారాయని, నీళ్ళు తాగడానికి పనికి రాకుండా అయ్యాయని వివరించారు. లక్కారం, ఇతర చెరువు నీళ్లు కలుషితం అయ్యాయని చెప్పారు. పంటలు పండే పరిస్థితి లేదని, పరిశ్రమల ఎదుట రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో అంకిరెడ్డి గూడెం ప్రజలు తమ గోడు విన్నవించుకున్నారని సభ దృష్టికి తెచ్చారు. పీసీబీ అధికారులు పరిశ్రమల వారితో కుమ్మక్కు కాగూడదని, నియమ నిబంధనలు పాటించేలా చూడాలని, కొత్త ఫార్మా పరిశ్రమలకు అనుమతి ఇవ్వగూడదని విజ్ఞప్తి చేశారు.

◆ ఎమ్మెల్సీ సత్యం లేవనెత్తిన సమస్యపై పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ శాసనమండలిలో సమాధానమిచ్చారు. పీసీబీ, ప్రభుత్వం అన్ని రకాల పరిశీలనలు చేశాక పరిశ్రమలకు అనుమతి ఇస్తుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బోర్డు సమావేశం నిర్వహించి ఫిర్యాదులపై పరిశీలించి నోటీసులు ఇస్తున్నారని, పట్టించుకోకుంటే క్లోజర్ ఆర్డర్ నోటీసులు ఇస్తున్నారని తెలిపారు.

◆ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలోని 18 బల్క్ డ్రగ్ పరి శ్రమలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారని సభలో తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిందని, ఆ బృందం సిఫార్సుల ప్రకారం చౌటుప్పల్ ప్రాంతంలోని 12 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణకు సూచనలిచ్చిందని చెప్పారు. భూగర్భ జల, వాయు కాలుష్యం, ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

గట్టి చర్యలు తీసుకుంటున్నాం: పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ
చౌటుప్పల్ ప్రాంతంలో పలు ఫార్మా కంపెనీలు కాలుష్య కారకంగా మారుతున్న క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన పరి శ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి గట్టి చర్యలు తీసుకుంటుందని పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. చౌటుప్పల్ లో 8 పరిశ్రమలకు జరిమానా విధించామన్నారు. భువనగిరి ప్రాంతంలో 18 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని, ఎక్కడైనా పరిశ్రమలు వాతావరణాన్ని కలుషితం చేస్తుంటే పిసిబి అధికారులకు, తమకు ఫిర్యాదు చేయొచ్చని పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.