పర్యావరణ చట్టాల అమలు, నిబంధనల పర్యవేక్షణలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పని తీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అలాగే తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ రామకృష్ణారావు అన్నారు. సనత్ నగర్ లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో 2025 జనవరి నుంచి నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో ముందున్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ కంటే మెరుగైన స్థానంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. పరిశ్రమల పనితీరు, ప్రజారోగ్యం మెరుగుదల, ల్యాబ్ పనితీరు, పీసీబీ పాలసీ విధానలపై చర్చించారు. సమావేశంలో ఏడాదిలో పీసీబీ చేపట్టిన కార్యక్రమాలను మెంబర్ సెక్రెటరీ గుగులోత్ రవి వివరించారు. ఏడాదిలో 1,335 సీఎస్ఈలకు అనుమతులు ఇచ్చామని, 169 దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. అదేవిధంగా 1,842 సీఎఫ్ ఓలకు అనుమతులిచ్చి, 202 అప్లికేషన్లు తిరస్కరించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,274 పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించామని, 149 పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చామని వెల్లడించారు. 840 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ సూచనలు చేసినట్లు చెప్పారు. కాలుష్య నియంత్రణకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. పరిశ్రమలకు అనుమతుల మంజూరు, ఆరోగ్య సేవల నియంత్రణ, లాబొరేటరీల బలోపేతం, పాలసీ సవరణలు, సాంకేతిక కమిటీల పనితీరుపై సమీక్షించారు. సీఎస్ఈ, సీఎస్ఓ, టాస్క్ ఫోర్స్ సలహా కమిటీల పదవీకాలం పూర్తయినప్పటికీ కొత్త కమిటీలను ఏర్పాటు చేయకపోవడం పట్ల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు సమావేశం గురించి ముందస్తు సమాచారం లేకపోవడంతో వివిధ విభాగాలకు చెందిన అధికారులు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో మెంబర్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు.