రూ.200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • 200 సంవ‌త్స‌రాలు నిలిచేలా రాతి కట్ట‌డాలు
  • కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : గిరిజ‌న‌, గిరిజ‌నేతరుల ఆరాధ్య‌దైవాలైన స‌మ్మ‌క సార‌ల‌మ్మ జాత‌ర నేప‌ధ్యంలో సుమారు 200 కోట్ల రూపాయిల‌కు పైగా ఖ‌ర్చుతో ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికీ దాదాపు 95 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వెల్ల‌డించారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో ఈ మేర‌కు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ .. కనీసం 200 సంవ‌త్స‌రాల‌కు పైగా నిలిచేలా రాతి క‌ట్ట‌డాల‌తో ఆధునీక‌ర‌ణ‌ప‌నులు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ఈ మేడారం చుట్టుప‌క్క‌ల సుమారు 10 కిలోమీట‌ర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికే ఆధునీక‌ర‌ణ ప‌నుల కోసం 29 ఎక‌రాల భూమిని అధికారికంగా సేక‌రించామ‌ని తెలిపారు. భక్తులకు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు మ‌రో 63 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌కు నిర్ణ‌యించామ‌ని వెల్ల‌డించారు. ఈనెల 29 నుంచి 31 వ‌ర‌కు జ‌రిగే మేడారం జాత‌ర కోసం కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో నిర్ల‌క్ష్యానికి గురైన ఈ మేడారం జాత‌ర, ఏర్పాట్లు, ఆధునీక‌ర‌ణ వంటి అంశాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తాను, ఈ ములుగు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌తినిధి, మంత్రి సీత‌క్క‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌ల‌తో క‌లిసి పలు మార్లు ప‌ర్య‌వేక్షిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌గు సూచ‌న‌లు ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈనెల 18 వ తేదీన మేడారం ఆధునీక‌ర‌ణ ప‌నులు ప్రారంభించేందుకు గాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో స‌హా శాస‌న‌స‌భ‌, శాస‌న మండ‌లి స‌భ్యుల‌ను, మంత్రులు, స్పీక‌ర్‌ల‌ను ఆహ్వానిస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వెల్ల‌డించారు.