- రోడ్లు, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించాలంటూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌కు ఆదేశాలు
- భూసేకరణ, నాలా పనులు, రోడ్డు అనుసంధానంపై ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్: గోషామహల్లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల పురోగతి, రోడ్డు మౌలిక సదుపాయాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి, సంబంధిత అన్ని శాఖల అధికారులతో విస్తృతంగా చర్చలు నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలో గుర్తించిన 56 నిర్మాణాలను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిగా తొలగించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీనివల్ల ఆసుపత్రి నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయని వెల్లడించారు.
ఇంతకు ముందు పోలీస్ శాఖ పరిధిలో ఉండి, అనంతరం వైద్య విద్యా సంచాలకత్వ శాఖ (డీఎంఈ)కి బదిలీ అయిన భూమికి సంబంధించి భూఉపయోగ మార్పు అంశంలో, ఎంఏ అండ్ యూడీ శాఖ నుంచి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) జారీ పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. ప్రాజెక్టు కన్సల్టెంట్లు, 2026 జనవరి 10 నాటికి పూర్తి డ్రాయింగుల షెడ్యూల్‌ను సమర్పిస్తామని, ఆమోదించిన కాలపరిమితి ప్రకారం పనులు కచ్చితంగా చేపడతామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ & కాడ్ శాఖ సమర్పించిన ప్రస్తుత నాలా డిజైన్‌ను సమీక్షించిన అనంతరం, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్)కు వెంటనే పనులు ప్రారంభించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రోడ్డు మౌలిక సదుపాయాల విషయంలో ప్రతిపాదిత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ)కు తక్షణమే డిజైన్ సిద్ధం చేయాలని, ఆసుపత్రి ప్రవేశ రోడ్డులో ట్రాఫిక్‌కు ఆటంకంగా మారిన మ్యాన్‌హోల్‌ను సరిచేయాలని, పరిసర రోడ్ల అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ వేగంగా చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు నిర్ణీత కాలపరిమితిలో పూర్తి అయ్యేలా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను సమాంతరంగా చేపట్టాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.